బాబా మంచివాడంటూ టీచర్ల పోస్టులు.. పోలీసులు రంగంలోకి దిగగానే..

Teachers Go Into Hiding Fear Of Arrest Shivashankar Baba Molested Case - Sakshi

శివశంకర్‌ బాబా లైంగికవేధింపుల కేసులో అనుమానితులు

అరెస్ట్‌కు భయపడి పరార్‌గా నిర్ధారణ 

సీఐడీ పోలీసుల గాలింపు 

సాక్షి, చెన్నై: చదువు, సంస్కారం నేర్పడం వారి వృత్తి. విద్యార్థులను లైంగిక వేధింపులకు ప్రోత్సహించడం వారి ప్రవృత్తి. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఐదుగురు ఉపాధ్యాయినులు సీబీసీఐడీ పోలీసుల కళ్లుకప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చెన్నై సమీపం కేళంబాక్కంలోని సుశీల్‌హరి పాఠశాల కరస్పాండెంట్‌ శివశంకర్‌బాబా అక్రమాలు అన్నీ ఇన్నీ కావనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చదువుకునే రోజుల్లో తమను లైంగికవేధింపులకు గురిచేసినట్లు పూర్వ విద్యార్థిని, విద్యార్థులు వాట్సాప్‌ ద్వారా బహిర్గతం చేశారు.

పలువురు విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇటీవల శివశంకర్‌ బాబాను పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేశారు. తరువాత ఈ కేసు సీబీసీఐడీ పోలీసుల చేతుల్లోకి వెళ్లింది. బాబాకు బెయిల్‌ మంజూరు చేయాలని చెంగల్పట్టులోని పోక్సో ప్రత్యేక కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి తమిళరసి విచారించారు. ఈనెల 13వ తేదీన మరలా విచారణకు రాగా శివశంకర్‌బాబాను న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినా బెయిల్‌ మంజూరు కాకపోగా ఈనెల 27వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య మరలా జైలుకు తరలించారు. అదే పాఠశాలలో పనిచేసే ఐదుగురు ఉపాధ్యాయినులు బాబాను అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు.

బాబా మంచివాడని పేర్కొంటూ వెనకేసుకొస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. బాబా మద్దతుగా వ్యవహరించిన ఐదుగురు ఉపాధ్యాయినులను విచారించాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. నేరుగా విచారణకు వివరణ ఇవ్వాల్సిందిగా బాబా ఆశ్రమానికి పక్కనే ఉన్న పళనిగార్డెన్‌ అపార్టుమెంటులో నివసిస్తున్న ఐదుగురు ఉపాధ్యాయినులకు సమన్లు పంపారు. అయితే ఈ ఐదుగురు హాజరుకాలేదు. ఈనెల 19వ తేదీ తప్పక హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లను స్వయంగా అందజేసేందుకు పోలీసులు శనివారం ఉదయం సదరు అపార్టుమెంటుకు వెళ్లగా ఐదుగురి ఇళ్లు తాళాలు వేసి ఉన్నాయి.  పోలీసులు ఐదుగురి ఇళ్ల తలుపులుపై సమన్లను అతికించి వెళ్లిపోయారు.  ఐదుగురు ఉపాధ్యాయినులు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top