ఎట్టకేలకు చిక్కిన నిదాఖాన్‌ | TCS Nashik Case: Nida Khan Arrested At Last | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు చిక్కిన నిదాఖాన్‌

May 8 2026 8:11 AM | Updated on May 8 2026 8:49 AM

TCS Nashik Case: Nida Khan Arrested At Last

టీసీఎస్‌లో మతమార్పిడి, లైంగిక వేధింపుల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసు ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. గురువారం చత్రపతి శంభాజీ నగర్‌ వద్ద పోలీసులను చూసి ఆమె తప్పించుకోబోగా.. సినీ ఫక్కీలో చేజ్‌ చేసి మరీ పట్టుకున్నారు. 

నాసిక్‌(మహారాష్ట్ర) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ బీపీవో యూనిట్‌లో వెలుగు చూసిన ఈ కేసు దేశాన్ని నివ్వెర పోయేలా చేసింది. తోటి ఉద్యోగులను మతం మారమని బలవంతం చేయడంతో పాటు మహిళా ఉద్యోగిణులకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయనే ఆరోపణలు వచ్చాయి.  నాలుగేళ్ల పాటు సాగిన ఈ వ్యవహారంలో మేనేజర్‌ స్థాయి వ్యక్తులతో పాటు టీం లీడర్లు, సీనియర్‌ ఉద్యోగులు భాగమయ్యారు. సుమారు 9 మంది బాధితులు(ఇందులో ఒక పురుషుడు కూడా) ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కాగా.. ఇప్పటిదాకా(నిదాఖాన్‌తో కలిపి) 8 మంది అరెస్ట్‌ అయ్యారు.    

మత మనోభావాలు దెబ్బ తీయడం, మతమార్పిడికి ప్రయత్నించిన వాళ్లను ‍ప్రొత్సహించడం, లైంగిక వేధింపులకు సహకరించడం.. నిదాఖాన్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి. ఫిర్యాదులు చేయాలని ప్రయత్నించిన వాళ్లను బెదిరించి ఆపేయడంతో పాటు ఇస్లాం స్వీకరించాలని ఒత్తిళ్లు కూడా చేసేదని తేలింది. బాధితులను హిజాబ్, బుర్ఖా ధరించమని ఆమె బలవంతం పెట్టడం, వాళ్ల ఫోన్లలో మత సంబంధిత యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయడం చేసిందని ఆధారాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో దర్యాప్తు అనంతరం ఆమెను పోలీసులు ప్రధాన నిందితురాలిగా చేర్చింది. 

అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆమె జాడ లేకుండా పోయిందని. ఆమె భర్తను విచారించిన తర్వాత.. పోలీసులు బంధువుల ఇళ్లతో పాటు పలు చోట్ల తనిఖీ చేశారు. కొన్ని చోట్ల తాళాలు వేసి ఉండటం, మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఆమెను పట్టుకోవడం కష్టమైంది. ఈలోపు తాను గర్భవతినని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. అయితే ఇంటరాగేషన్‌ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. 

దీంతో పరారీలో ఉన్న ఆమె కోసం కోసం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర అంతటా జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో 25 రోజుల తర్వాత పోలీసులకు చిక్కడం గమనార్హం. నిదాఖాన్‌ అరెస్ట్‌తో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. 

ఈ కేసులో ఇప్పటికే డానిష్‌ షేక్‌, టౌసిఫ్‌ అత్తర్‌, రాజా మెమోన్‌, షారూఖ్‌ ఖురేసీ; అసిఫ్‌ అన్సారీ, పోష్‌ కమిటీలో పని చేసిన అశ్విన్‌ చయ్‌నానీ అరెస్ట్‌ అయ్యారు. ప్రధాన సూత్రధారి నిదాఖాన్‌గా తేలగా.. హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అని ప్రచారం జరిగింది. అయితే ఆమె టెలికాలర్‌ మాత్రమేనని స్పష్టత ఇచ్చిన టీసీఎస్‌ యాజమాన్యం.. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆమెతో పాటు నిందితులందరినీ డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement