
ముంబై: విమాన ప్రయాణికులకు ఈ మధ్యకాలంలో వరుస ఝలక్‌లు తగులుతున్నాయి. తాజాగా గురువారం మరో ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానం ఒకటి టేకాఫ్ అయిన అరగంటకే తిరిగి అదే ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-639 విమానం ఉదయం పది గంటల ప్రాంతంలో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. అయితే 27 నిమిషాల తర్వాత ఇంజన్‌లలో ఒకదానికి సమస్య తలెత్తింది. అధిక ఎగ్జాస్ట్ గ్యాస్ ఉష్ణోగ్రతల కారణంగా.. ఇంజన్ షట్ డౌన్ అయ్యింది. దీంతో అత్యవసరంగా విమానాన్ని ముంబైలోనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది.
ఈ పరిణామంతో ప్రయాణికులు అందోళనకు లోనయ్యారు. ఇంజన్‌పై పీడనం పెరగడంతో ఆగిపోయినట్లు పైలెట్ గుర్తించారని, వెంటనే తిరిగి ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో విమానంలో ప్రయాణికులను బెంగళూరుకు చేర్చామని తెలిపారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) విచారణకు ఆదేశించింది.