Taj Mahal 22 Rooms Case: ‘తాజ్‌ మహల్‌ కాదు.. తేజో మహాలయా పిటిషన్‌’.. కోర్టు ఏమందంటే..

Taj Mahal 22 Doors Stay Locked Says Allahabad HC - Sakshi

అలహాబాద్‌: తాజ్‌ మహల్‌లో మూతపడి ఉన్న గదులను తెరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు(ఉత్తర ప్రదేశ్‌) తిరస్కరించింది. 22 గదుల్ని తెరవాల్సిన విషయంలో పిటిషనర్‌ జోక్యం అనవసరమని గురువారం లక్నో బెంచ్‌ వ్యాఖ్యానించింది.   

తాజ్‌మహల్‌ చరిత్రను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని, వాస్తవాలను తెలుసుకునే హక్కు ప్రజలకు కూడా ఉంటుందని దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టకుండానే తిరస్కరించింది. అంతేకాదు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వ్యవస్థను అవమానపరిచేలా వ్యవహరించొద్దంటూ పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని చరిత్రకారులకు వదిలేయండంటూ తేల్చి చెప్పింది. 

‘‘వెళ్లండి. వెళ్లి ఏదైనా పరిశోధనలు చేసుకోండి. ఎంఏలు, పీహెచ్‌డీలు చేసుకోండి. న్యాయస్థానాల సమయం వృథా చేయొద్దంటూ’’ అంటూ బెంచ్‌ న్యాయమూర్తులు ఉపాధ్యాయ్‌, సుభాష్‌ విద్యార్థిలు పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యవహారాన్ని సరదాగా నాలుగు గోడల మధ్య కూర్చుని చర్చిస్తే బాగుంటుంది. ఇలా కోర్టు రూమ్‌లో కాదు అంటూ బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాదు.. ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని, కోర్టు బయట మెథడాలజీ, చరిత్రకారుల ద్వారా తేలాల్సిన విషయం అని బెంచ్‌ స్పష్టం చేసింది. ఒకవేళ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలంటూ సూచించింది.

సీల్‌ చేసి ఉన్న గదులను తెరిపించేందుకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాను ఆదేశించాలంటూ బీజేపీ యూత్‌ మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్‌ రజనీష్‌ సింగ్‌ హైకోర్టు లక్నో బెంచ్‌ ముందు అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేశారు. తాజ్‌ మహల్‌ వాస్తవానికి తేజ్‌ మహాలయా అని.. అది శివుడి ఆలయం అంటూ ఆయన వాదించారు. అంతేకాదు నిజనిర్ధారణ కమిటీ ద్వారా అసలు చరిత్రను వెలుగులోకి తేవాలంటూ ఆయన ప్రభుత్వాన్ని కూడా కోరారు. 

మొఘలుల కాలానికి చెందిన తాజ్‌ మహల్‌ను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా పరిరక్షిస్తోంది. ఈ కళాఖండం 1982లో యనెస్కో​ వరల్డ్‌ హెరిటేర్‌ సైట్‌ గుర్తింపు దక్కించుకుంది కూడా.

చదవండి: తాజ్‌ మహల్‌ కట్టిన స్థలం మాదే!: బీజేపీ ఎంపీ దియా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top