తాజ్‌ మహల్‌ కట్టిన స్థలం మాదే!.. ఆధారాలున్నాయ్‌: బీజేపీ ఎంపీ దియా కుమారి

Taj Mahal Land Belongs To Jaipur royal family Says BJP MP - Sakshi

జైపూర్‌: ప్రపంచ వింతలో ఒకటిగా గుర్తింపు పొందిన తాజ్‌ మహల్‌ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. తాజ్‌ మహల్‌లోని 22 గదుల్ని తెరవాలంటూ ఓ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజ్‌ మహల్‌ ఉన్న ప్రాంతం.. తమ రాజకుటుంబానికి చెందినదే అంటూ రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ దియా కుమారి అంటున్నారు. 

ఆగ్రాలో తాజ్‌ మహల్‌ కట్టించిన ప్రాంతం వాస్తవానికి జైపూర్‌ పాలకుడు జై సింగ్‌కు సంబంధించింది. అందుకు తగ్గ ఆధారాలు తమ పూర్వీకుల రికార్డుల్లో ఉన్నాయి అని బుధవారం రాజస్థాన్‌ బీజేపీ ఎంపీ దియా కుమారి ఒక ప్రకటన చేశారు. ఆ భూమి తమ కుటుంబానికే చెందిందని, షా జహాన్‌ దానిని స్వాధీనం చేసుకున్నాడని ఆమె అంటున్నారు.

ఆ కాలంలో న్యాయ వ్యవస్థ, అప్పీల్‌ చేసుకునే అవకాశం లేదన్న విషయం అందరికీ తెలుసని. ఒకవేళ తమ దగ్గరున్న రికార్డులను పరిశీలిస్తే.. విషయం ఏంటో స్పష్టంగా తెలిసి వస్తుందని ఆమె అంటున్నారు. అంతేకాదు.. అలహాబాద్‌ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను సైతం ఆమె సమర్థించారు. ‘‘తాజ్‌ మహల్‌లో 22 గదులు తెరవాలని పిటిషన్‌ వేశారు. దానికి నేను మద్ధతు ఇస్తా. ఎందుకంటే అది తెరుచుకుంటేనే.. వాస్తవం ఏంటో అందరికీ తెలుస్తుంది.

తాజ్‌ మహల్‌ కంటే ముందు అక్కడ ఏముందో తెలిసే అవకాశం ఉంది. బహుశా అక్కడ గుడి కూడా ఉండొచ్చు. మక్బరా కంటే ముందు అక్కడ ఏముందో తెలుసుకునే హక్కు అందరికీ ఉంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అయితే తమ పూర్వీకులకు(జైపూర్‌ పాలకుల)  సంబంధించిన రికార్డులను తాను పరిశీలించలేదని, ఆ తర్వాతే వాటిపై ఓ నిర్ధారణకు వచ్చి ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంటానని ఆమె అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top