
జమ్మూ/చండీగఢ్: కాల్పుల విరమణ ఒప్పందం సమగ్రస్థాయిలో అమలుకు భారత్ ప్రయత్నిస్తున్న వేళ సోమవారం రాత్రి మళ్లీ జమ్మూకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో అనుమానాస్పద డ్రోన్లు కలకలం సృష్టించాయి. వీటిని వెంటనే భారత భద్రతా బలగాలు నేలమట్టం చేశాయి. చిన్నపాటి డ్రోన్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్మీ అధికారులు స్పష్టంచేశారు. ఆవలి నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి దూసుకొచ్చిన డ్రోన్లను ఆర్మీ డిఫెన్స్ గన్స్‌తో పేల్చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతున్నాయి. మే 8వ తేదీన సైతం ఇదే సాంబా సెక్టార్‌లో పాకిస్తానీ డ్రోన్లు రావడం, భారత బలగాలు పేల్చేయడం తెల్సిందే.
అమృత్‌సర్, హోషియార్‌పూర్‌లో బ్లాక్‌ఔట్
ముందుజాగ్రత్త చర్యగా పంజాబ్‌లోని అమృత్‌సర్, హోషియార్‌పూర్ జిల్లాల్లో సోమవారం స్థానిక యంత్రాంగం బ్లాక్‌ఔట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో సరిహద్దు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపేశారు. జలంధర్ పరిధిలోని ప్రాంతాల్లోనూ పాక్షికంగా బ్లాక్‌ఔట్‌ను అమలుచేశామని జలంధర్ డిప్యూటీ కమిషన్ హిమాన్షు అగర్వాల్ తెలిపారు. పాకిస్తాన్‌తో పంజాబ్ 553 కి.మీ.ల మేర సరిహద్దు పంచుకుంటోంది.
సోమవారం సైతం అమృత్‌సర్‌లో సైరన్ శబ్దాలు వినిపించాయి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలని అమృత్‌సర్ ప్రజలకు ఇప్పటికే సందేశాలు పంపించామని అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ చెప్పారు. ముందుజాగ్రత్త చర్యగా అమృత్‌సర్, పఠాన్‌కోట్, ఫజిల్‌కా, ఫిరోజ్‌పూర్, తర్న్ తరన్ జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. పఠాన్‌కోట్, అమృత్‌సర్ జిల్లాల్లో కళాశాలలు, విశ్వవిద్యాలయాలకూ మంగళవారం సెలవు ప్రకటించారు.