
న్యూఢ్లిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కంచ గచ్చిబౌలి కేసు విచారణలో సుప్రీంకోర్టు సూచించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యావరణాన్ని, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మంచి ప్రతిపాదనలు తీసుకురావాలన్నారు. ఈ సమస్యకు సంతోషకరమైన ముగింపు పలకాలన్నారు. అలాగే అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు.
పర్యావరణాన్ని కాపాడితే అన్ని ఫిర్యాదులు ఉపసంహరిస్తామని, అప్పుడు తాము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతామని జస్టిస్ అన్నారు. పర్యావరణాన్ని, అభివృద్ధిని సమతుల్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీం సూచనల దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు ఆరు వారాల సమయం కావాలని సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ కోరారు.
హైదరాబాద్ లోని కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఐటీ పార్క్ అభివృద్ధి కోసం చెట్లను నరికివేయడం, వన్యప్రాణులను మరో ప్రాంతానికి తరలించడం లాంటి చర్యలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు జరిగిన వాదనల్లో చెట్లను నరికిన వంద ఎకరాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టాలని సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రణాళికను కోర్టుకు సమర్పించాలని కోరింది.