
కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతికి కాల పరిమితి విధించడంపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీలోగా సమాధానాలను అందజేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది.
ఈ అంశంపై ఆగస్ట్‌లో విచారణ చేపడతామని వెల్లడించింది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపే విషయంలో రాష్ట్రపతి న్యాయస్థానాలు కాల పరిమితి విధించవచ్చా అంటూ మేలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతో లేఖ రాయడం తెల్సిందే. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి అవి అందిన నాటి నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఏప్రిల్‌లో జారీ చేసిన ఉత్తర్వులు సంచలనం రేపడం తెల్సిందే.