శబరిమల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య
తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: న్యాయ సమీక్షాధికారం తమ రాజ్యాంగ విధి అని, సంస్కరణలు, సంక్షేమం వంటి అంశాల్లో ఆ అధికారాన్ని తాము వదులుకోజాలమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేరళలోని శబరిమల, తదితర మత ప్రాంతాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టడం తెల్సిందే.
ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ లాయర్ కె.పరమేశ్వర్ గురువారం తన వాదనలు వినిపించారు. ‘సామాజిక సంక్షేమం, సంస్కరణల ప్రాథమిక బాధ్యత శాసనసభలపైనే ఉంటుంది. ఇది రాజ్యాంగబద్ధమైన ఆదేశం. దీనర్థం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కోర్టులకు అధికారం లేదని కాదు. న్యాయస్థానం అత్యుత్సాహం చూపే సంస్కర్త మాదిరిగా ఉండరాదు, అలాగని ప్రేక్షక పాత్రకే పరిమితం కారాదు’అని పరమేశ్వర్ పేర్కొన్నారు. ‘మతపరమైన హక్కుల చెల్లుబాటును హేతుబద్ధత వంటి అంశాల ఆధారంగా అంచనా వేయకూడదు.
విశ్వాసానికి, హేతబద్ధతకు చాలా వ్యత్యాసం ఉంది. హేతుబద్ధతను తెరపైకి తెచ్చిన పక్షంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25, 26లు ఉనికినే కోల్పోతాయి. ప్రజల స్వేచ్ఛను, సమగ్రతను కాపాడే సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానాలు మతాచారాల్లో జోక్యం చేసుకోవచ్చు’అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై సీజేఐ ఏకీభవించారు. ‘న్యాయసమీక్ష బాధ్యతను రాజ్యాంగ న్యాయస్థానం వదులుకోజాలదు. ఇది కేవలం అధికారానికి సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగం కోర్టుకున్న రాజ్యాంగవిధి’అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు.
16 రోజులపాటు కొనసాగిన వాదనలు
ప్రార్థనాస్థలాల్లో మహిళలపై వివక్షపై వాదనలు వాదనలు ముగించిన 9 మంది సభ్యుల విస్తృత ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆయా పక్షాలు తమ వాదనలను ఈ నెల 29వ తేదీలోగా పూర్తిస్థాయిలో రాతపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోనిరాజ్యాంగ ధర్మాసనం 16 రోజులపాటు వాదనలు విన్నది. సీఎస్ వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గి, ఇందిరా జైసింగ్, నీరజ్ కిషన్ కౌల్, గోపాల్ శంకరనారాయణన్ తదితర సీనియర్ లాయర్లు వాదనలు వినిపించారు.
ధర్మాసనంలో సీజేతోపాటు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఆగస్టీన్ జార్జి మసీహ్, జస్టిస్ ప్రసన్న బీ వరాలె, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి ఉన్నారు. అంతకు ముందు కేంద్రం, శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళలను అనుమతించరాన్న నిబంధనను కొనసాగించాలని సుప్రీంకోర్టుకు రాతపూర్వకంగా తెలిపింది. ఈ నిబంధనల మత విశ్వాసాల పరిధిలోకి వస్తుందని, న్యాయపరమైన సమీక్షకు ఇది అతీతమని వివరించింది.
శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తూ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2018లో తీర్పు వెలువరించడం తెల్సిందే. అనంతరం సుప్రీంకోర్టు ఈ అంశంపై అంతిమ నిర్ణయాన్ని తీసుకునే అవకాశాన్ని విస్తృత ధర్మాసనానికి బదలాయించాలని నిర్ణయించింది. శబరిమలతోపాటు మసీదులు, దర్గాల్లో ముస్లిం మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం, పార్సీయేతర పురుషులను వివాహమాడిన పార్సీ మహిళలను ఆ మత పవిత్రప్రాంతంలోకి అనుమతించారన్న అంశంపైనా తాజాగా విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. ముస్లిం, పార్సీ మహిళలు తమ ప్రార్థనా స్థలాల్లోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షల వంటి మత స్వేచ్ఛా వ్యవహారాల్లో సంపూర్ణ న్యాయం చేయడానికి ఒక న్యాయ విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని కూడా ధర్మాసనం పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టీకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ హక్కు పరిధిలోకి వచ్చే ఏడు ప్రశ్నలను పరిశీలిస్తామని ధర్మాసనం ముందుగానే తెలిపింది. అవి..
→ ఆర్టీకల్ 25 ప్రకారం మత స్వేచ్ఛా హక్కు పరిధి, పరిమితి ఏమిటి?
→ ఆర్టీకల్ 25 ప్రకారం దఖలు పడే హక్కులకు, ఆర్టీకల్ 26 కింద మతపరమైన సంస్థలకు ఉండే హక్కులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
→ ఆర్టీకల్ 26 ప్రకారం మత సంస్థలకు ఉండే హక్కులు.. ప్రజా శాంతి, నైతికత, ఆరోగ్యంతో పాటు ఇతర ప్రాథమిక హక్కులకు కూడా లోబడి ఉంటాయా?
→ ఆర్టీకల్ 25, 26లలో పేర్కొన్న నైతికత అనే పదానికి అర్థం, పరిధి ఏమిటి? అందులో రాజ్యాంగబద్ధమైన నైతికత కూడా భాగమేనా?
→ ఆర్టికల్ 25లో పేర్కొన్న మతపరమైన ఆచారాల విషయంలో న్యాయ సమీక్షకు ఎంత వరకు అవకాశముంటుంది?
→ రాజ్యాంగంలోని అధికరణ 25 (2) (బీ)లో ఉన్న హిందువులలోని విభాగాలు అనే పదానికి అర్థం ఏమిటి?
→ ఏదైనా ఒక మత సమూహానికి, సంస్థకు చెందని వ్యక్తి, ఆ మతానికి సంబంధించిన ఆచారాలను ప్రశ్నిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేయొచ్చా?.


