breaking news
constitutional changes
-
భగ్గుమన్న లద్దాఖ్
లేహ్: కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ) లద్దాఖ్ లో ఒక్కసారిగా నిప్పు రగిలింది. లద్దాఖ్‌కు తక్షణమే రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగపరమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని లేహ్‌లో జనం బుధవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా హింస ప్రజ్వరిల్లింది. ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. సీఆర్పీఎఫ్ వ్యాన్ సహా పలు వాహనాలను దహనం చేశారు. వీధుల్లో విధ్వంసం సృష్టించారు. ఇళ్లు, దుకాణాలపై దాడులకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీలకు పనిచెప్పారు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పదుల సంఖ్యలో పోలీసులు సైతం ఉన్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లద్దాఖ్‌లో కర్ఫ్యూ విధించింది. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, జనం ఇళ్ల నుంచి బయటకు రావొద్దని స్పష్టంచేసింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మరణించినట్లు ఆందోళనకారులు ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే వారు కాల్పులు జరిపినట్లు మండిపడ్డారు. 15 రోజులుగా నిరాహార దీక్షలు ఒకప్పుడు ఉమ్మడి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో అంతర్భాగమైన లద్దాఖ్ 2019 ఆగస్టు 5న ఆరి్టకల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వచి్చంది. ఇక్కడ శాసనసభ కూడా లేదు. జమ్మూకశ్మీర్ నుంచి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడాన్ని అప్పట్లో లద్దాఖ్ ప్రజలు స్వాగతించారు. కానీ, రాష్ట్ర హోదా కావాలన్న ఆకాంక్ష వారిలో ఇటీవల మొదలైంది. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతోపాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్‌తో లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ)కి సంబంధించిన యువజన సంఘం పోరాడుతోంది. లద్దాఖ్ పర్యావరణాన్ని, సహజ వనరులను, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి గిరిజనుల హక్కులను కాపాడుకొనేందుకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు అవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. రాష్ట్ర హోదా కోసం ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగుచుక్ సహా 15 మంది ఈ నెల 10వ తేదీన నిరాహార దీక్ష ప్రారంభించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారు దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించాలి: ఒమర్ తాజా పరిణామాలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇవ్వలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ లద్దాఖ్ ప్రజలు హోదా కోసం పోరాడుతున్నారని చెప్పారు. వారి అభివృద్ది కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్రం దగా చేసిందని, అందుకే రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కేంద్రం తెలుసుకోవాలన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం తాము శాంతియుతంగా పోరాడుతున్నామని గుర్తుచేశారు. జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా కల్పించాల్సిందేనని ఒమర్ అబ్దుల్లా తేలి్చచెప్పారు. ఏమిటీ ఆరో షెడ్యూల్? రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయా, త్రిపుర, మిజోరంలో గిరిజనులకు ప్రత్యేక రక్షణలు లభిస్తున్నాయి. అటానమస్ జిల్లా కౌన్సిళ్ల ద్వారా స్వయం ప్రతిపత్తి దక్కుతోంది. భూములు, అడవులు, స్థానిక పాలనపై గిరిజనులే చట్టాలు చేసుకోవచ్చు. గిరిజనులు హక్కులు, సంప్రదాయాలు, స్వయం పాలనను కాపాడేందుకు ఆరో షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. లద్దాఖ్‌లో గిరిజనుల జనాభా ఏకంగా 97 శాతం ఉంది. తమ హక్కులు, స్వయం పాలన కోసం ఆరో షెడ్యూల్లో చేర్చాలని లద్దాఖ్ ప్రజలు పట్టుబడుతున్నారు. ఇది జెన్–జెడ్ విప్లవం: వాంగుచుక్ రాష్ట్ర హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య కొన్నిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఎల్‌ఏబీతోపాటు కార్గిల్ డెమొక్రటిక్ అలయెన్స్(కేడీఏ) సభ్యులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ 6న మరోదఫా చర్చలు జరగాల్సి ఉంది. ఇంతలోనే హింస చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నిరాహార దీక్షలు కొనసాగుతుండడం, మరోవైపు లద్దాఖ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో అక్టోబర్ 6 కంటే ముందే చర్చలు జరపాలని ఆందోళనకారులు తేలి్చచెప్పారు. రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్‌ను విస్తరించడం, లేహ్, కార్గిల్‌కు ప్రత్యేక లోక్‌సభ స్థానాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై కేంద్రం తక్షణమే తమతో చర్చించాలని డిమాండ్ చేస్తూ లేహ్ అపెక్స్ బాడీ బుధవారం లేహ్ బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో వందలాది మంది యువత లేహ్‌కు తరలివచ్చారు. తొలుత బీజేపీ ఆఫీసు వద్ద గుమికూడారు. ఆఫీసుకు నిప్పుపెట్టారు. ఫర్నిచర్‌ను దహనం చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో హింస మొదలైంది. తాజా హింసాకాండ నేపథ్యంలో సోనమ్ వాంగుచుక్ తన 15 రోజుల నిరాహార దీక్షను బుధవారం విరమించారు. ఘర్షణలకు దూరంగా ఉండాలని తన అనుచరులకు సూచించారు. ప్రజలపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడాన్ని ఖండించారు. యువత ఆగ్రహావేశాలే లద్దాఖ్ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వాంగుచుక్ వెల్లడించారు. ఇది జెన్–జెడ్ విప్లవం అని తేలి్చచెప్పారు. ఇన్నాళ్లూ శాంతియుతంగా పోరాడినా ఎలాంటి ఫలితం లేకపోవడం వల్లే యువత ఆగ్రహానికి గురై హింసకు దిగారని చెప్పారు. -
18 సవరణలు చేయాలి
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే 18 రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమవుతాయి. కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. దానికోసం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 325ని సవరించాల్సి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ‘ఆరి్టకల్ 324ఏ’కు సవరణ అవసరం. ఈ రెండు అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చేవి కాబట్టి రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాలు సమ్మతి తెలపాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ తెలిపింది. -
పుతిన్.. ఎన్నటికీ రష్యాధిపతే!
మాస్కో: రష్యాలో రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా సాగుతున్న తన అధికారాన్ని ఇకపైనా నిరాటంకంగా కొనసాగించే దిశగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా తాజాగా పలు రాజ్యాంగ సంస్కరణలను ఆయన ప్రతిపాదించారు. పార్లమెంటు, కేబినెట్ అధికారాలను విస్తృతపరచాల్సి ఉందని బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని ఈ మేరకు సవరించాల్సి ఉందన్నారు. 2024తో దేశాధ్యక్షుడిగా పుతిన్ పదవీకాలం ముగియనుండటంతో... ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్లమెంటు పాత్ర పెరగాలి: ప్రధానమంత్రిని, కేబినెట్‌ను ఎంపిక చేసే అధికారాన్ని పార్లమెంట్‌కు ఇవ్వాలని పుతిన్ తాజాగా ప్రతిపాదించారు. ప్రస్తుతం ఆ అధికారం అధ్యక్షుడి చేతిలో ఉంది. ‘ఆ అధికారాలను ఇవ్వడం ద్వారా పార్లమెంటరీ పార్టీలు, పార్లమెంట్ పాత్ర మరింత పెరుగుతుంది. ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల అధికారం, స్వతంత్రత కూడా పెరుగుతాయి’ అని ఆ ప్రసంగంలో పుతిన్ స్పష్టంచేశారు. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక పెట్టారాయన. ‘‘అలాగని పార్లమెంటరీ పాలన విధానం గొప్పదని చెప్పలేం. పార్లమెంటరీ వ్యవస్థలోకి వెళ్తే దేశ సుస్థిరతకు ప్రమాదం కలిగే అవకాశముంది. ‘ప్రధానిని, కేబినెట్‌ను రద్దు చేసే అధికారం అధ్యక్షుడికే ఉండాలి. రక్షణ రంగంలోని అత్యున్నత అధికారులను నియమించే అధికారం సైతం దేశ అధ్యక్షుడికే ఉండాలి. రష్యా మిలటరీ, ఇతర దర్యాప్తు సంస్థల ఇన్చార్జిగా కూడా అధ్యక్షుడే ఉండాలి’ అని పుతిన్ స్పష్టం చేశారు. ప్రాంతీయ గవర్నర్లు సభ్యులుగా ఉన్న స్టేట్ కౌన్సిల్ అధికారాలను కూడా రాజ్యాంగంలో నిర్దిష్టంగా పేర్కొనాలని సూచించారాయన. ‘ఎక్కువమంది పిల్లలున్న వారికి ప్రభుత్వ సబ్సిడీలను పెంచాలి. తక్కువ ఆదాయం వల్లే జనం ఎక్కువ మంది పిల్లలు వద్దనుకుంటున్నారు. వారి ఆదాయాన్ని పెంచేలా పరిశ్రమలు తేవాలి’ అని చెప్పారాయన. రష్యా ప్రస్తుత జనాభా 14.7 కోట్లు. ప్రతిపాదిత సంస్కరణలను దేశవ్యాప్త ఓటింగ్‌కు పెట్టాలని పుతిన్ కోరారు. మెద్వదేవ్ రాజీనామా పుతిన్ ప్రసంగం అనంతరం, దేశ ప్రధాని దిమిత్రి మెద్వదేవ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పుతిన్ తీసుకురాదలచిన మార్పులను సానుకూలపర్చేందుకు వీలుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మెద్వదేవ్ రాజీనామాను పుతిన్ ఆమోదించారు. ఆయన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం, ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉప దళపతిగా మెద్వదేవ్‌ను, తదుపరి ప్రధానిగా మైఖేల్ మిషుస్తిన్‌ను నియమించారు. ఆ వెంటనే, ఈ నియామకాల్ని పార్లమెంట్ ఆమోదించింది. కాగా, మెద్వదేవ్ పనితీరుపై గతంలో పుతిన్ పలు సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ ఆలోచన ఇదే!! రష్యా రాజ్యాంగం వరసగా రెండుసార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండటానికి అవకాశం కల్పిస్తోంది. 2000వ సంవత్సరంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్... నిబంధనల ప్రకారం నాలుగేళ్లు చొప్పున 2008 వరకూ రెండుసార్లు అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తరవాత ప్రధాని పదవిని చేపట్టారు. ప్రధానిగా ఉన్న తన అనుచరుడు మెద్వదేవ్‌ను అధ్యక్షుడిని చేశారు. తన పదవీకాలంలో మెద్వదేవ్... అధ్యక్ష పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచేశారు. అంతేకాకుండా 2012లో పుతిన్ కోసం మెద్వదేవ్ తన పదవి నుంచి దిగిపోయారు. అప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పుతిన్ 2018లో మొదటి విడతను పూర్తి చేసుకుని, రెండోవిడత కూడా కొనసాగుతున్నారు. 2024 వరకూ పదవీ కాలం ఉంది. గ్యాప్ కోసం 2024లో మళ్లీ దిగి... ప్రధానిగా బాధ్యతలు చేపడతారని, అప్పుడు కూడా తన చేతిలో అధికారమంతా ఉండేందుకే పుతిన్ ఈ ప్రతిపాదన చేశారని విశ్లేషకుల మాట. తన స్థానంలో అధ్యక్షుడిగా వచ్చే వ్యక్తి .. మళ్లీ తనకే పగ్గాలు అప్పగించేలా చేయడమే పుతిన్ వ్యూహమని చెబుతున్నారు. జోసెఫ్ స్టాలిన్ తరువాత అత్యధిక కాలం దేశ కీలక పదవిలో కొనసాగిన ఘనత పుతిన్‌దే కావడం విశేషం. రష్యా కొత్త ప్రధాని మైఖేల్ మిషుస్తిన్ -
‘అగ్ర’ కోటా మౌలిక సూత్రాలకు వ్యతిరేకం
హైదరాబాద్ : అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సామాజిక న్యాయానికి తీవ్ర వ్యతిరేక మని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఓ బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య అన్నారు. బిల్లుకు వ్య తిరేకంగా ఫిబ్రవరి 11న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఈశ్వరయ్య తెలిపారు. బిల్లును వ్యతిరేకించిన ఆర్జేడీ, ఆప్, ముస్లింలీగ్, ఎంఐఎం పార్టీలను ధర్నాకు ఆహ్వానిస్తామన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలభార తీయ ఓబీసీ ఫెడరేషన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, బీసీ మహాజన సమితి సంయుక్త ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. సామా జికంగా వెనకబడి ఉన్న వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో ఉంటే దాన్ని పట్టించుకోకుండా రిజర్వేషన్లు కల్పించడమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల రాజ్యాంగం పరం గా అంటరాని తనం చూపినట్లే అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీకి మద్దతుగా గులాబీ , పచ్చ పార్టీలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలం గాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లపై వీధిపోరాటం చేస్తూనే న్యాయపోరాటం చేస్తున్నామని దీనిలో భాగంగానే ఢిల్లీలో ధర్నా నిర్ణయం, తాను హైకోర్టులోనూ, జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 9 శాతం, ఆఖరుకు 9.5 శాతం ఉన్న అగ్రవర్ణాలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చి 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం 27 శాతం ఇవ్వడం దారుణమన్నారు. 56 శాతం ఉన్న బీసీలు ఉద్యోగాల్లో 8 శాతం మాత్రమే ఉన్నారని ఇంకా రిజర్వేషన్లలో కోత విధించడం సబబా అని ప్రశ్నించారు. గతంలో వర్సి టీ యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు ఇచ్చేవారని, కానీ అగ్రవర్ణాలకు చెందిన కొందరు కోర్టుకు వెళ్లగా డిపార్ట్మెంట్ యూనిట్‌గా కేటాయించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని, దీనితో సుప్రీంకోర్టు కూడా ఏకీభవించిందన్నారు. దీనివల్ల బీసీలకు నష్టంవాటిల్లుతోందని, వర్సిటీ ఉన్నత ఉద్యోగాల్లో ఇక బీసీలు ఉండరని తెలిపారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ, అసమానతల మధ్య సమాన పోటీ ఉండరాదని రిజర్వేషన్లు కేటాయించగా తిరిగి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వ డం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 85 శాతం ఉన్న బడుగులకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మిగిలిన 50 శాతం జనరల్ కోటా కింద 15 శాతం ఉన్న అగ్రవర్ణాలకు, అందరికీ కేటాయించారని ఇంకా వారికి రిజర్వేషన్లు ఎందుకన్నారు. వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే బీసీల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చి పాలకులకు తగిన బుద్ధి చెపుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పలువురు పాల్గొన్నారు. -
క్యూబాలో సొంత ఆస్తిహక్కు!
హవానా: కమ్యూనిస్టు రాజ్యం క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు త్వరలో సాకారం కాబోతోంది. ఇందుకు సంబంధించి సవరించిన రాజ్యాంగ బిల్లు వారం రోజుల్లో జాతీయ అసెంబ్లీ ముందుకు రానుంది. 1976లో ఫిడెల్ క్యాస్ట్రో అధ్యక్షతన ఏర్పాటైన సోషలిస్టు రాజ్యాంగం సొంత ఆస్తిహక్కుకి పూర్తిగా వ్యతిరేకం. పాత రాజ్యాంగంలో ఉన్న 137 ఆర్టికల్స్‌కు అదనంగా మరో 224 ఆర్టికల్స్‌ను కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని ముసాయిదాలో ప్రతిపాదించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ బిల్లు సభలో ఆమోదం పొందితే క్యూబాలో వ్యక్తిగత ఆస్తిహక్కు చట్టబద్దమమవుతుంది. వ్యక్తిగత ఆస్తిని ఆమోదించడం అంటే చట్టబద్ధంగా ప్రైవేటు ఆస్తికి రక్షణనివ్వడమేననీ, తద్వారా ప్రైవేటు పారిశ్రామికవేత్తలకు ఇది ఊతమిస్తుందని ప్రభుత్వ అధికారిక పత్రిక గ్రాన్మా అభిప్రాయపడింది. రౌల్ క్యాస్ట్రో అనంతరం మిగ్వెల్ డియాజ్ కానెల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రాజ్యాంగ సంస్కరణలు వేగం పుంజుకున్నాయి. 2011లో చేసిన చట్ట సవరణతో ఆస్తి అమ్మకాలపై నిషేధాన్ని తొలగించారు. -
రాజ్యాంగ సవరణతోనే రాష్ట్రాలకు రక్ష
ఆర్టికల్ 3ని వక్రీకరించి రాష్ట్ర విభజన వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి ధ్వజం హైదరాబాద్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ఎమ్మెల్యేలను సామ, దాన, దండోపాయాలతో విభజన బిల్లుకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని వక్రీకరించి ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర విభజన ప్రక్రియ-సమాఖ్య స్ఫూర్తి’ అనే అంశంపై శనివారం మహాసభ కార్యాలయంలో జరిగిన చర్చా వేదికలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజనతో, కాస్తో కూస్తో మిగిలి ఉన్న సమాఖ్య స్ఫూర్తిని ఢిల్లీ పెద్దలు కాలరాస్తున్నారన్నారు. స్పీకర్‌కు కూడా ఢిల్లీ నుంచే ఆదేశాలు, తాయిలాలు అందుతున్నాయని ఆరోపించారు. ఒక ప్రాతిపదిక లేకుండా.. కమిటీ, కమిషన్ ఏదీ చర్చించకుండా విభజన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుపై ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించడం దేశ సమగ్రతకు ఎంతో అవసరమని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర శాసనసభలోగానీ, పార్లమెంట్లో గానీ కనీసం మూడింట రెండొంతుల మెజార్టీతోనే రాష్ట్రాల పునర్విభజన జరిగేలా రాజ్యాంగాన్ని సవరించాలని సూచించారు. లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి ఎన్.తులసిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సి.నర్సింహారావు, కె.రవీంద్ర, పి.రామజోగయ్య, కె. నారాయణరావు, ఎ.మురళి, సయ్యద్ జాఫ్రీ, వీవీ కృష్ణారావు, విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులురవితేజ, చక్రవర్తి ఇందులో పాల్గొన్నారు.