మద్యం అక్రమ కేసులో అత్యున్నత న్యాయస్థానం విశేషాధికారాల వినియోగం
రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌గా ముందస్తు బెయిల్ పిటిషన్ మార్పు
ఇందుకు ఆర్టికల్ 142ను ఉపయోగించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం
నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు
విచారణకు సహకరించాడు
పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఎందుకు ఉంచాలి?
దర్యాప్తు సంస్థకు అత్యున్నత న్యాయస్థానం ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది.
దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్‌రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అవినాశ్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు..
» ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు.
» ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
» ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది.
» దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌గా పరిగణించి ఊరట కల్పించాలి.
ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే..
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్‌లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది.


