Sharad pawar: రాష్ట్రపతి ఎన్నికలు: విపక్షాలకు శరద్‌ పవార్‌ షాక్‌

Sources: Sharad Pawar Says Not In President Race Amid Opposition Moves - Sakshi

న్యూఢిల్లీ, ముంబై: రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్షాలకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ షాక్‌ ఇచ్చారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని శరద్‌ పవర్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ‘నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయడం లేదు. రాష్ట్రపతి రేసులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను’ అని సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఎన్సీపీ సమావేశంలో శరద్‌ పవార్‌ తెలిపారు. 

కాంగ్రెస్‌కు చేరని పవార్‌ నిర్ణయం
‘ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయనే దానిపై శరద్‌ పవర్‌కు నమ్మకం లేదు. అందుకే ఓడిపోయే పోరులో పోటీ చేసేందుకు ఆయనకు ఇష్టం లేదు’ అని ఎన్సీపీ సన్నిహత వర్గాలు చెబుతున్నాయి. అయితే పవార్‌ తన అభిప్రాయాన్ని ఇంకా కాంగ్రెస్‌కు చెప్పలేదని తెలుస్తోంది. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరుపున 81 ఏళ్ల శరద్‌ పవర్‌ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
చదవండి: పోలీసుకు తన ‘పవర్‌’ చూపాడు.. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌కే పవర్‌ కట్‌

పవార్‌ అభ్యర్థిత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే గురువారం ముంబైలో శరద్‌పవార్‌తో భేటీ అయి, వెల్లడించినట్లు సమాచారం. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత సంజయ్‌ సింగ్‌ కూడా ఎన్సీపీ నేతతో ఫోన్‌లో చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  జూన్‌ 15న (బుధవారం) ఢిల్లీలో ప్రతిపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.  

జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. దీంతో జూలై 18 న కొత్త రాష్ట్రపతి కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ్య సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభ్యులు, ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మ్యేల్యేలు సభ్యులుగా ఉంటారు. ఎలక్టోరల్‌ కాలేజీలోని మొత్తం 10,86,431 ఓట్లకు గాను 50%ఓట్లు సాధించిన వారే రాష్ట్రపతి అవుతారు. మెజారిటీ మార్కును దాటేందుకు బీజేపీకి మరో 13వేల ఓట్ల అవసరముంది.అయితే కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మరికొన్నిన పార్టీలు మద్దతు ఇస్తుండటంతో..అధికార పార్టీ అభ్యర్థియే తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి అభ్యర్థి పేరును ఎన్డీయే ఇంకా ప్రకటించలేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top