దీక్షాస్థలిలో వాంగ్‌చుక్‌కు వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం
నిరాహార దీక్షకు ఏడు రోజులు పూర్తి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో వారం రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం విషమిస్తోంది. ఆయన ఐదు కిలోల మేర బరువు తగ్గారని, ఆరోగ్యం క్షీణిస్తోందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)శనివారం ఆదోళన వెలిబుచ్చింది. పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలనే డిమాండ్‌తో సీజేపీ నిరసనలు చేపట్టిన విషయం తెల్సిందే. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఎక్స్‌లో..‘దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకీ విషమిస్తోంది. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మంత్రి ప్రధాన్‌ను తొలగించలేదు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారు?’అని ప్రశ్నించారు. కనీసం 20 మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకున్న తర్వాత కూడా ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీశారు. వాంగ్‌చుక్‌కు జరగరానిదేమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని దీప్కే హెచ్చరించారు.
ఆరోగ్యం విషమించినా సరే, ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకునేదాకా దీక్ష విరమించేది లేదని సోనమ్ గట్టిగా చెబుతున్నారని దీప్కే మరో పోస్టులో తెలిపారు. ‘ఎగ్జామ్ పేపర్’అని రాసి ఉన్న కాగితాలను ఓ వ్యక్తి తినేందుకు ప్రయత్నిస్తుండగా రెండు కాక్రోచ్‌లు అడ్డుకుంటున్నట్లుగా ఉన్న వ్యంగ్యాత్మక కార్టూన్, గో బ్యాక్ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యాఖ్యతో ఆయన షేర్ చేశారు. కాగా, తమ ప్రాంత అభివృద్ధికి చేస్తున్న డిమాండ్లపై కేంద్రం, లద్దాఖ్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతిని సోనమ్ వాంగ్‌చుక్ శుక్రవారం రాత్రి ఎక్స్‌లో స్వాగతించారు.
అదేవిధంగా, విద్యా శాఖ జవాబుదారీతనం విషయంలోనూ ప్రభుత్వం స్పందించాలని కోరారు. జంతర్‌మంతర్‌లోనే మరో వేదికపై ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్‌ఏ)కు చెందిన ఆరుగురు నేతలు చేపట్టిన నిరాహార దీక్ష కూడా వారం రోజులు పూర్తి చేసుకుంది. దీక్షలో కూర్చున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి దానిష్ అలీ తీవ్ర అస్వస్థతగకు గురవడంతో శనివారం సాయంత్రం రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆమె బ్లడ్ సుగర్ స్థాయిలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని విద్యార్థి నేతలు తెలిపారు. మిగతా ఐదుగురు నిరశన కొనసాగిస్తున్నారన్నారు.నీట్, తదితర పరీక్షల్లో అకవతవకలపై జూన్ 20వ తేదీ నుంచి, 15 రోజులుగా జంతర్‌మంతర్‌లో నిరసనలు కొనసాగిస్తుండటం తెల్సిందే.
మమ్మల్ని నిజంగానే కాక్రోచ్‌లుగానే భావిస్తున్నారా?
ప్రధాని మోదీకి సీజేపీ లేఖ
విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో జంతర్‌మంతర్ వద్ద 15 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నా ప్రధాని మోదీ స్పందించకపోవడంపై సీజేపీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇదే వేదికపై వారం రోజులుగా సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారని సీజేపీ పేర్కొంది. ఇకనైనా మౌనం వీడాలని ప్రధాని మోదీని కోరింది.
‘ఇది మానవత్వానికి సంబంధించిన ప్రశ్న: జంతర్ మంతర్ నిరసనలను మీరు ఇంకెన్నాళ్లు విస్మరిస్తారు?’పేరుతో రాసిన రెండు పేజీల లేఖను శనివారం సీజేపీ విడుదల చేసింది. లేఖపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, మరో ఏడుగురు ప్రతినిధుల సంతకాలున్నాయి. ’మీ మౌనం మమ్మల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తోంది..మేమంతా కేవలం బొద్దింకలం(కాక్రోచ్) మాత్రమేనని మీరు నిజంగానే భావిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. ’ప్రధానిగా మీరు సీజేపీ నిరాహార దీక్షపై స్పందించడం లేదు.
మీ మౌనం ఈ దేశ యువతను పట్టించుకోవాల్సిన అవసరం లేని కేవలం పురుగులుగా భావిస్తున్నారనేందుకు పరోక్ష అంగీకారం’అని వ్యాఖ్యానించింది. ‘పాలకులపై నైతికపరమైన ఒత్తిడిని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిందే నిరాహార దీక్ష. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన సోనమ్ వాంగ్‌చుక్ వంటి వ్యక్తి ఆహారం తీసుకోవడానికి నిరాకరించడంపై ప్రభుత్వం నుంచి నైతిక, రాజకీయ పరమైన స్పందన వస్తుందని ఆశించడం సహజం. అయినప్పటికీ, మీరు ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు’అని సీజేపీ ఆ లేఖలో పేర్కొంది.
కోట్లాది మంది యువత నమ్మకాన్ని, భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేసిన పరీక్షా పత్రాల లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం పదేపదే విఫలమైనందుకే దీక్ష చేపట్టినట్లు వివరించింది. జూన్ 20న నిరసన ప్రారంభం కావడానికి ముందు 11గా ఉన్న విద్యార్థుల ఆత్మహత్యలు ఇప్పుడు 29కి చేరాయని సీజేపీ తెలిపింది. ’ఏ ప్రభుత్వమూ ప్రశ్నించడానికి అతీతం కాదు. ఏ మంత్రి కూడా బాధ్యత నుంచి తప్పించుకోలేరు. సమాధానాలు డిమాండ్ చేస్తున్న పౌరుల గొంతును ఏ యంత్రాంగమూ నొక్కేయలేదు’ అని ఆ లేఖలో స్పష్టం చేసింది.


