కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాల్ని అడ్డుకున్న ఆమె.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఆవుల జనన సర్టిఫికేట్ చూపించాలి’అని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పత్రా శనివారం హింగల్గంజ్‌లోని లేబుఖాలి ప్రాంతంలో గోవుల రవాణా వాహనాన్ని అడ్డుకున్నారు. రహదారి మార్గంలో వాటికి నీరు, ఆహారం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రేఖా పత్రా మాట్లాడుతూ.. 14 ఏళ్ల లోపు ఆవులను వధ చేయరాదు. ఎవరు అక్రమంగా ఆవులను తరలిస్తే వారిని పట్టుకోవాలి. ఆవుల జనన సర్టిఫికేట్ చూపించమని అడగాలి. చూపించలేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పార్టీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ మాట్లాడుతూ, “బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఆవుకు జనన సర్టిఫికేట్ ఇచ్చిన ఉదాహరణ చూపించగలరా? ఒకటి చూపిస్తే మాకు కూడా ఉపయోగపడుతుంది. ఆ సర్టిఫికేట్ ఎవరు జారీ చేశారో కూడా తెలుసుకోవాలి” అని వ్యంగ్యంగా అన్నారు.
అయితే టీఎంసీ నేతల సెటైర్లపై బీజేపీ నేతలు ఘాటుగానే స్పందిస్తున్నారు. గోవధను అరికట్టాలంటే జనన దృవీకరణ పత్రాలు ఉండాల్సిందేనని అంటున్నారు. ఎమ్మెల్యే రేఖా పత్రా ఆలోచన బాగుందని తెలిపారు.


