Haryana: కుప్పకూలిన మూడంతస్తుల రైస్‌ మిల్లు.. నలుగురు కార్మికులు మృతి

Several Died Injured 3 Storey Rice Mill Building Collapses Haryana Karnal - Sakshi

హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. మూడు అంతస్తుల రైస్‌ మిల్లు భవనం కుప్పకూలడంతో నలుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటన కర్నాల్‌ జిల్లాల నితారోరిలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. కార్మికులు తమ షిఫ్టులు ముగిసిన తర్వాత రైస్‌మిల్లులో పడుకునేవారు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి రైస్‌ మిల్లులో దాదాపు 150 మంది కార్మికులు నిద్రిస్తున్నారు. 

ఈ క్రమంలో అర్థరాత్రి ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు మరణించగా.. మరో 24 మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ యంత్రాల ద్వారా భవన శిథిలాలను తొలగిస్తున్నారు. మొత్తం ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తెలియలేదు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సరైన కారణాలు తెలియాల్సి ఉంది.

భవనంలో కొన్ని లోపాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, రైలు మిల్లు యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై విచారణకు కమిటీ వేయనున్నట్లు డీసీ కర్నాల్ అనీష్ యాదవ్ తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top