SCO Defence Ministers Meet: ఉగ్రవాదాన్ని పెకిలిద్దాం

SCO Defence Ministers Meet: Rajnath Singh sends tough message on terrorism at SCO meet - Sakshi

కలిసికట్టుగా పనిచేద్దాం

ఎస్సీఓ సదస్సులో రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పారు. ఈ విషయంలో షాంఘై కో–అపరేషన్‌ ఆర్గనైజేషన్‌(ఎస్సీఓ) సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని, దాన్ని అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి అండదండలు అందించేవారి పీచమణచాలని చెప్పారు.

కూటమిలోని సభ్యదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకొనేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ సిద్ధం చేయాలని అన్నారు. చైనా, పాకిస్తాన్‌ తీరును పరోక్షంగా ఆయన తప్పుపట్టారు. ఎస్సీఓ సదస్సుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షత వహించారు. సభ్య దేశాల నడుమ విశ్వాసం, సహకారం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌ ప్రకారం శాంతి, భద్రతకు ఊతం ఇవ్వాలన్నదే తమ ఆశయమని వివరించారు.

ఎస్సీఓ సదస్సుకు చైనా, రష్యా తదితర సభ్య దేశాల రక్షణశాఖ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్‌ రక్షణ శాఖ మంత్రి హాజరు కాలేదు. ఆయన బదులుగా  పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్‌ అహ్మద్‌ ఖాన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. షాంఘై సహకార కూటమి 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. ఇందులో భారత్, రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో పాకిస్తాన్‌ శాశ్వత సభ్యదేశంగా మారింది.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top