కుక్కలకు ఇచ్చే విలువ కూడా రైతులకు ఇవ్వడం లేదు: సత్యపాల్ మాలిక్

Satya Pal Malik Attacks Centre Farmers Protest Condolence Message When Dog Dies - Sakshi

జైపూర్‌: ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనపై కేంద్రం తీరుని ఎండగడుతూ.. మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి విరుచుకుపడ్డారు. జైపూర్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ.. దేశాన్ని ఏలే నాయకులు కుక్క చనిపోయినప్పుడు కూడా సంతాప సందేశాలు పంపుతారని, అయినప్పటికీ రైతుల మరణాల గురించి పట్టించుకోవడానికి మాత్రం సమయం దొరకడం లేదని ఘాటుగా విమర్శించారు.

‘ఇప్పటి వరకు ఇంత పెద్ద ఉద్యమం ఎన్నడూ జరగలేదు. రైతు ఉద్యమంలో ఇప్పటి వరకు 600 మంది అమరులయ్యారు. ఒక జంతువు చనిపోతే ‘పెద్ద’ల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తుతాయి. రైతుల మరణాల విషయంలో మాత్రం కేంద్ర నాయకత్వం అనుసరిస్తున్న తీరు సరికాదు’ అని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదంలో మరణించినవారికి నాయకులు సంతాప సందేశం పంపిన విషయాన్ని గుర్తు చేశారు. గవర్నర్ కుర్చీ నుంచి దిగిపోవడానికి భయపడేది లేదని మాలిక్ మరోసారి స్పష్టం చేశారు.

కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను సత్యపాల్ మాలిక్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. కొత్త వ్యవసాయ చట్టాలు ఏవీ రైతులకు అనుకూలంగా లేవని సత్యపాల్ మాలిక్ ఈ ఏడాది మార్చిలో చెప్పారు. చట్టాలు ఏవీ రైతులకు అనుకూలంగా లేవని, రైతులు, సైనికులు సంతృప్తి చెందని దేశం ముందుకు సాగదు, ఆ దేశాన్ని రక్షించలేము, అందుకే సైన్యాన్ని, రైతులను సంతృప్తి పరచాలని మాలిక్ కోరారు.

చదవండి: దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top