విమాన ప్రమాదం వెనుక విద్రోహ చర్య?: మంత్రి మురళీధర్ మోహోల్ | Sabotage Angle also being Probed in Air India | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం వెనుక విద్రోహ చర్య?: మంత్రి మురళీధర్ మోహోల్

Jun 29 2025 10:22 AM | Updated on Jun 29 2025 12:30 PM

Sabotage Angle also being Probed in Air India

న్యూఢిల్లీ: ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై అన్ని కోణాలలో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. ఈ ప్రమాదం దరిమిలా ఎయిర్ ఇండియా విమానం ఏI 171లోని బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారని అన్నారు.

విమాన ప్రమాదం దురదృష్టకర సంఘటన అని, ఏఏఐబీ దీనిపై పూర్తి దర్యాప్తు ప్రారంభించిందని, దీనిలో ఏదైనా  విద్రోహ చర్య ఉందా? అనే అంశంతో పాటు అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌లను సంబంధిత అధికారులు సమీక్షిస్తున్నారని, పలు సంస్థలు విచారణలో భాగస్వామ్యం వహిస్తున్నాయని మోహోల్ తెలిపారు. జూన్ 12న లండన్‌కు వెళ్తున్న బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 ఫ్లీట్‌కు చెందిన ఏI 171 విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒకరు మాత్రమే ప్రమాదం నుండి బయటపడ్డారు.

ఈ ప్రమాదాన్ని మంతి మురళీధర్ మోహోల్  అరుదైన కేసుగా అభివర్ణించారు. రెండు ఇంజిన్లు  ఒకేసారి షట్ డౌన్ కావడం ఎప్పుడూ జరగలేదంటూ, అనుభవజ్ఞులైన పైలట్లు, నిపుణుల వాదనలను  ఆయన గుర్తుచేశారు. విచారణ అనంతరం నివేదిక వచ్చిన తర్వాతనే ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని అన్నారు. ఈ ఘటనపై నివేదిక మూడు నెలల్లో వస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా బ్లాక్ బాక్స్‌ను పరిశీలన కోసం విదేశాలకు పంపుతారనే వాదనలను మోహోల్ తోసిపుచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement