
పట్నా: కేంద్ర మాజీ మంత్రి పశుపతి కుమార్ పరాస్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్‌ఎల్‌జేపీ) ఎన్‌డీఏతో తెగదెంపులు చేసుకుంది. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పరాస్ ఈ విషయం ప్రకటించారు. దివంగత రాం విలాస్ పాశ్వాన్ సోదరుడే పరాస్.
అయితే, పాశ్వాన్ కుమారుడు చిరాగ్‌తో పొసగక లోక్ జనశక్తి పార్టీని వీడి బయటకు వచ్చిన పరాస్ 2021లో ఆర్‌ఎల్‌జేపీ ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)పార్టీకి ఐదు సీట్లు కేటాయించడంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ పరాస్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. పరాస్ సొంత సీటు హజీపూర్ సహా ఆ ఐదు సీట్లనూ చిరాగ్ పార్టీ గెలుచుకుంది. ఎన్‌డీఏను అంటిపెట్టుకునే ఉన్నా ఆయన పార్టీకి ఇచ్చిన బంగ్లాను ప్రభుత్వం ఖాళీ చేయించి, చిరాగ్‌కు కేటాయించింది. ఈ పరిస్థితుల్లోనే పరాస్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.