
న్యూఢిల్లీ: నిరసనలు తెలిపే హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు చెయ్యడం కుదరదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ప్రజా జీవితానికి భంగం కలిగేలా ఒకే ప్రాంతంలో రోజుల తరబడి నిరసనలు తెలపడం సరికాదని పేర్కొంది. గత ఏడాది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్ ఆందోళనల సమయంలో బహిరంగ ప్రదేశాలను ఆక్రమించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం తీర్పు చెప్పింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ, దానిని సమీక్షించాలంటూ షహీన్‌బాగ్ వాసి కనీజ్ ఫాతిమాతో పాటు మరి కొందరు సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను శనివారం విచారించిన డివిజన్ బెంచ్ ఆ పిటిషన్లన్నింటినీ కొట్టేసింది.
ఏదైనా అంశంపై అప్పటికప్పుడు నిరసన ప్రదర్శనలు జరపడం ప్రజాస్వామిక హక్కు అని, అయితే ఎక్కువ రోజులు బహిరంగ ప్రదేశాలను ఆక్రమిస్తూ ఇతరుల హక్కులకి భంగం వాటిల్లేలా నిరసనలు చేయడం కుదరదని చెప్పింది. ‘‘ప్రభుత్వ విధానాలపై నిరసనలు చేయడం, అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంగా వచ్చిన హక్కు. పౌరులకు హక్కులే కాదు ఇతరుల హక్కులకు భంగం వాటిల్లకుండా బాధ్యతగా కూడా వ్యవహరించాలి. అప్పటికప్పుడు ఎవరైనా నిరసన తెలపవచ్చు. కానీ ఎక్కువ రోజులు ఇతరుల హక్కుల్ని భంగపరుస్తూ బహిరంగ ప్రదేశాలను ఆక్రమించకూడదు’’అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లోని రోడ్లపైనే రెండు నెలలకు పైగా రైతులు నిరసనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మళ్లీ ఇలాంటి తీర్పునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఓపెన్ కోర్టుని నియమించాలన్న అభ్యర్థనను కూడా న్యాయమూర్తులు తిరస్కరించారు.