అందుకే ముంబై ఫ్యామిలీ మృతి.. పుచ్చకాయేం చేయలేదని వెల్లడి | Rat Poison In Watermelon Killed Mumbai Family | Sakshi
Sakshi News home page

అందుకే ముంబై ఫ్యామిలీ మృతి.. పుచ్చకాయేం చేయలేదని వెల్లడి

May 7 2026 9:46 PM | Updated on May 7 2026 10:10 PM

Rat Poison In Watermelon Killed Mumbai Family

ముంబైలో గత నెల ఓ కుటుంబ సభ్యులు భోజనం చేసిన తర్వాత పుచ్చకాయ తిని మృతి చెందిన విషయం సంచలనం రేపింది. దీంతో పుచ్చకాయ తింటే మంచిది కాదంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, ఆ కుటుంబంలోని నలుగురు తిన్న పుచ్చకాయలో ఎలుకల మందు ఉందని ఫోరెన్సిక్ విశ్లేషణలో బయటపడింది. ఎలుకల విషంలో సాధారణంగా వాడే జింక్ ఫాస్ఫైడ్‌ను ఆ పుచ్చకాయ శాంపిల్‌లో గుర్తించారు.

ఇంట్లో మృతిచెందిన ఆ నలుగురు కుటుంబ సభ్యుల పుచ్చకాయ నమూనాలు, విసెరా నమూనాల్లో ఈ విషయాన్ని గుర్తించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదికను గురువారం ముంబై పోలీసులకు సమర్పించారు.

జింక్ ఫాస్ఫైడ్ అత్యంత విషపూరిత పదార్థమని, ఆ నలుగురి మరణాలకు అదే కారణమై ఉంటుందని ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు తెలిపారు. జింక్ ఫాస్ఫైడ్‌ను ఎలుకల వంటి వాటిని నియంత్రించేందుకు వాడతారు. పొలాలు, నిల్వ ధాన్యంలోనూ ఉపయోగిస్తారు.

ఓ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. “ఇవాళ నివేదిక సమర్పించాం. రెండు నమూనాల్లో జింక్ ఫాస్ఫైడ్ కనిపించింది. అవి పుచ్చకాయ, మృతిచెందిన నలుగురి విసెరా నమూనాలు. సాధారణంగా ఇది పొడి రూపంలో ఉంటుంది. ఎవరో పుచ్చకాయ కోసి, అందులో ఈ పొడి చల్లి ఉండొచ్చని భావిస్తున్నాం. ఆ తర్వాత దాన్ని తిన్నారు. అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు తేలుస్తారు” అని అన్నారు.

కాగా, గతనెల అబ్దుల్లా డోకాడియా (40), ఆయన భార్య నసీమ్‌ (35), వారి ఇద్దరు కుమార్తెలు ఆయేషా (16), జైనబ్‌ (13) ఏప్రిల్ 26న దక్షిణ ముంబైలోని వారి ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. బంధువులకు ఇంట్లో విందు ఇచ్చిన కొన్ని గంటల తరువాత ఈ ఘటన జరిగింది. అందరూ కలిసి భోజనం చేసినప్పటికీ, అర్ధరాత్రి తర్వాత ఆ నలుగురు పుచ్చకాయ తిన్నారు.

ముంబై పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ.. నివేదిక అందిందని, పుచ్చకాయలో ఎలుకల విషం ఎవరు కలిపారో ఇప్పుడు దర్యాప్తు చేస్తామని తెలిపారు. “ఇది ఆత్మహత్య? లేక హత్య? లేక వ్యవసాయ పొలంలో కలుషితమై పొడి పుచ్చకాయలోకి చేరిందా? అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం” అని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement