శాంతి బోధకులమే కానీ, మా జోలికొస్తే ఊరుకోం..

Rajnath Singh Says India Priest Of World Peace But Capable Replying To Aggression - Sakshi

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ 

కిమిన్‌(అరుణాచల్‌ప్రదేశ్‌): శాంతి కాముక దేశం భారత్‌కు దురాక్రమణను దీటుగా ఎదుర్కొనే సత్తా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. చైనాతో సరిహద్దుల్లో గురువారం ఆయన సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్‌వో) నిర్మించిన 12 వ్యూహాత్మక రహదారులను జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. భారతదేశం ప్రపంచ శాంతికి బోధకుడు వంటిదన్న రక్షణమంత్రి.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి ఎటువంటి అవరోధం వాటిల్లినా పరిణామాలు ప్రతికూలంగా ఉంటాయన్నారు. ‘మనం ప్రపంచ శాంతిని కోరుకుంటాం. ఎవరైనా దుందుడుకుగా వ్యవహరిస్తే తగు సమాధానమిస్తాం’అని స్పష్టం చేశారు.

హాట్‌ స్ప్రింగ్స్, గోగ్రా పోస్ట్‌ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో చైనా బలగాలను కొనసాగిస్తుండటంపై పరోక్షంగా డ్రాగన్‌ దేశాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘గత ఏడాది గల్వాన్‌ లోయలో మన జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి, వీరోచితంగా పోరాడారు. దేశం కోసం జరిగిన అప్పటి పోరులో వీరమరణం పొందిన వారికి సెల్యూట్‌ చేస్తున్నాను’అని ఆయన అన్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణకు కొత్త రోడ్ల నిర్మాణం ఉపకరిస్తుందన్నారు. ఈ రహదారుల నిర్మాణంతో సరిహద్దుల్లో బలగాలు వేగంగా కదిలేందుకు వీలవుతుందన్నారు. గురువారం ప్రారంభించిన 12 రహదారుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో 10, లద్దాఖ్, జమ్మూకశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున రహదారులున్నాయి.

చదవండి: దేశంలో 8 లక్షల దిగువన కరోనా పాజిటివ్‌  కేసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top