
మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని కోరారు. ఈ పాశవిక చర్యపై చర్చించడంతోపాటు దేశమంతా ఐక్యంగా ఉందనే విషయాన్ని చాటిచెప్పాల్సిన అవసరముందన్నారు. గత వారం చోటుచేసుకున్న దారుణ ఘటనలో 26 మంది పర్యాటకులు అసువులు బాయడం తెల్సిందే.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరారు. ‘ఈ సమయంలో ఐక్యత, సంఘీభావం ప్రకటించాల్సిన అవసరముంది. వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యమని ప్రతిపక్షం విశ్వసిస్తోంది.
అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడిని ఎదుర్కోవడానికి మనందరి సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది’అని ఆయన తెలిపారు. ప్రధానికి రాసిన లేఖలో రాహుల్ గాంధీ సైతం ఇదే విషయం తెలిపారు.