సరిహద్దులో సంసిద్ధం..

Rahul Gandhi Fires On Narendra Modi Over LAC Standoff - Sakshi

హద్దులు మార్చేందుకు చైనా ప్రయత్నం

వాటిని భారత్‌ అంగీకరించదు

లోక్‌సభలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ప్రకటన 

మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై విపక్షం నిరసన 

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా నుంచి భారత్‌ ఒక సవాలును ఎదుర్కొంటోందని తెలిపారు. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలు భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని ఆ దేశానికి చాలా స్పష్టంగా చెప్పామని లోక్‌సభకు వివరించారు. చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు సంబంధించి రాజ్‌నాథ్‌ మంగళవారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.

సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో భారత సైనిక దళాల శక్తి, సామర్ధ్యాలను సభ సంపూర్ణంగా విశ్వసించాలన్నారు. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సంక్లిష్ట పర్వత శిఖరాలపై దేశమాత రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న మన సాయుధ దళాలను ప్రోత్సహించేలా, వారిలో స్ఫూర్తి నింపేలా సభ ఒక తీర్మానం చేయాలి’ అని రాజ్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు. గల్వాన్‌ లోయలో జూన్‌ 15న చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ప్రత్యర్థుల వైపు ప్రాణనష్టంతో పాటు, భారీగా నష్టం జరిగేలా భారత సైనికులు వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. ‘ఆ సమయంలో కల్నల్‌ సంతోశ్‌ బాబు తన 19 మంది సైనికులతో కలిసి చూపిన అసమాన ధైర్యసాహసాలు, పరాక్రమం, వీరత్వం నన్ను కదిలించి వేశాయి. దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడే లక్ష్యంలో వారు చేసిన ప్రాణత్యాగం నిరుపమానం’ అని రాజ్‌నాథ్‌ కొనియాడారు.

ఆ ఘర్షణల్లో తెలుగువాడైన కల్నల్‌ సంతోశ్‌ బాబుతో పాటు 19 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. చైనా వైపు కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. కానీ ఆ సంఖ్యను చైనా అధికారికంగా వెల్లడించలేదు. ఆ ఘర్షణల్లో 43 మంది వరకు చైనా సైనికులు చనిపోయినట్లు ఆ తరువాత వార్తలు వచ్చాయి. భారత జవాన్ల సాధారణ పెట్రోలింగ్‌ను చైనా సైనికులు అడ్డుకునే క్రమంలో ఘర్షణలు ప్రారంభమయ్యాయని రాజ్‌నాథ్‌ వివరించారు. క్షేత్రస్థాయి కమాండర్ల మధ్య చర్చలు సాగుతుండగానే.. మే నెల మధ్యలో పశ్చిమ సెక్టార్‌లోని కొంగ్‌కా లా, గొగ్రా, ప్యాంగాంగ్‌ సరస్సు ఉత్తర తీరం ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖను దాటి వచ్చేందుకు చైనా బలగాలు పలుమార్లు ప్రయత్నించాయని తెలిపారు. అయితే, చైనా ప్రయత్నాలను ముందే పసిగట్టి, తదనుగుణంగా భారత దళాలు చర్యలు చేపట్టాయని వివరించారు. 

చైనాకు స్పష్టం చేశాం 
రష్యా రాజధాని మాస్కోలో షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశం సందర్భంగా చైనా రక్షణ మంత్రితో తాను ప్రత్యేకంగా జరిపిన భేటీని రాజ్‌నాథ్‌ ప్రస్తావించారు. ‘సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకే మా తొలి ప్రాధాన్యం. అదే సమయంలో, భారత దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో మా నిబద్ధతపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు’ అని చైనా రక్షణ మంత్రికి తేల్చిచెప్పానని వెల్లడించారు. ‘సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించడం, వారి సైనికుల దుందుడుకు చర్యలు, వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చాలనే ప్రయత్నాలు.. మొదలైన చైనా దుశ్చర్యల విషయంలో మన వ్యతిరేకతను వారికి స్పష్టంగా వివరించాం. ఇవన్నీ రెండు దేశాల మధ్య కుదిరిన పలు ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించడమేనని వివరించాం’ అన్నారు. వాస్తవాధీన రేఖ వెంట ఇరు దేశాలు అత్యల్ప సంఖ్యలో సైనిక బలగాలను విధుల్లో నిలపాలన్నది  1993, 1996లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాల్లోని ప్రధానాంశమని సభ్యులకు రాజ్‌నాథ్‌ వివరించారు. అలాగే, ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్‌ యిల మధ్య జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన ఐదు అంశాల ఒప్పందం గురించి కూడా రాజ్‌నాథ్‌ వివరించారు.

మోదీ అబద్ధాలు చెప్పారు 
తూర్పు లద్దాఖ్‌లో చైనా దురాక్రమణ గురించి ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్‌ ఆరోపించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ లోక్‌సభలో చేసిన ప్రకటన ఆ విషయాన్ని స్పష్టం చేసిందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ‘మోదీజీ. చైనా ఆక్రమించిన మన భూభాగాన్ని ఎప్పుడు వెనక్కు తీసుకువస్తారు?l’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. లోక్‌సభలో రాజ్‌నాథ్‌ ప్రసంగం అనంతరం తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు. ఆ తరువాత పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేశారు. చైనాతో ఉద్రిక్తతలపై సభలో చర్చ జరిపేందుకు అధికార పక్షం భయపడుతోందని విమర్శించారు.

అక్రమ ఆక్రమణ
లద్దాఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతంలోని దాదాపు 38 వేల చదరపు కిలోమీటర్ల భూమి చైనా అక్రమ ఆక్రమణలో ఉందని రాజ్‌నాథ్‌ వెల్లడించారు. ‘అది కాకుండా, 1963లో కుదిరిన చైనా–పాకిస్తాన్‌ సరిహద్దు ఒప్పందం ప్రకారం పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోని 5,180 చదరపు కి.మీ.ల భారత భూ భాగాన్ని పాకిస్తాన్‌ చైనాకు అప్పగించింది. అలాగే, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సరిహద్దు ల్లో ఉన్న దాదాపు 90 వేల చదరపు కి.మీ.ల భారత భూభాగం కూడా తమదేనని చైనా వాదిస్తోంది’ అని సభకు తెలిపారు. ఈ సందర్భంగా సరిహద్దు వివాదానికి సంబంధించిన చరిత్రను సభకు రక్షణ మంత్రి వివరించారు. ఇరు దేశాల మధ్య సంప్రదాయంగా వస్తున్న సరిహద్దును చైనా అంగీకరించడం లేదన్నారు. శతాబ్దాల చరిత్ర, వినియోగం ఆధారంగా ఆ సరిహద్దును నిర్ణయించారని, ద్వైపాక్షిక ఒప్పందాలు దాన్ని నిర్ధారించాయని తెలిపారు. ‘అయితే, ఆ సరిహద్దు అధికారికంగా నిర్ధారించినది కాదని చైనా వాదిస్తోంది. ఆ సరిహద్దు రేఖకు సంబంధించి రెండు దేశాలకు వేర్వేరు నిర్ధారణలు ఉన్నాయి’ అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top