సెంట్రల్‌ జైలుకు నటి రాగిణి 

Ragini Dwivedi Remanded To 14Day Judicial Custody In Drugs Case - Sakshi

సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్‌ రంకా, లూమ్‌ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు.  

బెయిల్‌ కష్టం   
రాగిణితో పాటు 14 మంది నిందితులపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపిఎస్‌) చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో బెయిల్‌ దొరకటం కష్టమని తెలిసింది. మరో నటి సంజనను విచారణకు సహకరించటంలేదని సీసీబీ పేర్కొనగా, మరో 2 రోజుల పాటు వారి కస్టడీకి అనుమతించడంతో మంగళ, బుధవారాలు ప్రశ్నించనున్నారు. అంతకుముందు నిందితులకు కేసీ జనరల్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ టెస్టులను, ఇతర వైద్య పరీక్షలను చేయించారు. రాగిణి, సంజనలకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది.   

ప్రముఖులతో నిందితుడు  
డ్రగ్స్‌ కేసులో కాంగ్రెస్‌ బీబీఎంపీ కార్పొరేటర్‌ కేశవమూర్తి కొడుకు యశస్‌ కోసం ఎన్‌సీబీ పోలీసులు ముంబై నుంచి బెంగళూరుకు వచ్చి గాలిస్తున్నారు. ఈ నెల 7న విచారణకు పిలవగా ఒకసారి వచ్చి వెళ్లాడు. తరువాత విచారణకు పిలవగా అదృశ్యమయ్యాడు.   

త్వరలో వీఐపీలకు నోటీసులు?  
రాగిణి, సంజన, ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు అనుమానితుల జాబితాను రూపొందించారు. ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల పుత్రులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులూ ఉన్నట్లు తెలిసింది. విచారణకు రావాలని వారికి నోటీసులు పంపనున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులు, వ్యాపారవేత్తల పుత్రులు కూడా జాబితాలో ఉన్నారు. అనేకమంది ప్రముఖులు తాము నిర్వహించే డ్రగ్స్‌ పార్టీల్లో పాల్గొనేవారని రాగిణి, సంజనలు విచారణలో వెల్లడించారు.  

నేను దొంగ అవుతానా: జమీర్‌   
డ్రగ్స్‌ కేసులో తనను ఇరికించి రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతోందేమోనని కాంగ్రెస్‌ మాజీ మంత్రి, చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ ఆరోపించారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు.  నిందితుడు ఫాజల్‌తో నాకు పరిచయం లేదు. ఒక దొంగ నాతో  కలిసి ఫోటో తీయించుకుంటే నేను దొంగను ఎలా అవుతానని ప్రశ్నించారు.  

వీఐపీలతో రాహుల్‌ చెట్టాపట్టాల్‌   
డ్రగ్స్‌ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన డ్రగ్స్‌ డీలర్‌ రాహుల్‌తో రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌.ఆశోక్, నిర్మాత కె.మంజు కలిసి ఉన్న ఫోటోలు వైరల్‌ అయ్యాయి. నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్‌ సినీ, రాజకీయ, క్రికెట్‌ ప్రముఖులతో స్వీట్లు తింటూ దిగిన ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు ఉపేంద్ర, క్రికెటర్‌ శ్రీశాంత్, శ్రీనగర కిట్టి, రఘు ముఖర్జీ, సంగీత దర్శకుడు గురుకిరణ్, నటీ ఐంద్రితా రై, ప్రియాంక, హర్షికా పూణచ్చ, ఒక రిటైర్డ్‌ ఐజీలతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరితో ఇతనికి గల సంబంధాలు ఎలాంటివన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top