హ్యాపీ ల్యాండింగ్‌ : రఫేల్‌ జెట్స్‌ వచ్చేశాయ్‌! | Sakshi
Sakshi News home page

భారత గగనతలంలోకి రఫేల్‌ జెట్స్‌

Published Wed, Jul 29 2020 2:41 PM

Rafale Jets Enter Indian Air - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) దీర్ఘకాలంగా వేచిచూస్తున్న అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం అంబాలా వైమానికి స్ధావరానికి మరికాసేపట్లో చేరుకుంటాయి. భారత గగనతలంలోకి బుధవారం మధ్యాహ్నం తొలి బ్యాచ్‌లో భాగంగా ఐదు రఫేల్‌ యుద్ధవిమానాలు చేరుకోగానే భారత నౌకా యుద్ధవిమానం నుంచి భారీ స్వాగతం లభించింది. ‘హిందూ మహా సముద్రానికి స్వాగతం మీరు సగర్వంగా ఆకాశాన్ని తాకవచ్చు..హ్యాపీ ల్యాండింగ్స్‌’ అంటూ ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా రఫేల్‌ జెట్స్‌కు రేడియో సందేశం పంపింది. ఇందుకు రఫేల్‌ పైలట్‌ ధన్యవాదాలు తెలిపారు.

రఫేల్‌ యుద్ధవిమానాలు అంబాలకు చేరగానే వాటిని వైమానిక దళంలో చేర్చే కార్యక్రమాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. ఇక చైనాతో సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అత్యాధునిక రఫేల్‌ యుద్ధవిమానాలు చేరుకోవడంతో ఐఏఎఫ్‌ పోరాట సామర్థ్యం ఇనుమడిస్తుందని భావిస్తున్నారు.

కాగా, నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్సుతో రూ.59 వేల కోట్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.మొదటి బ్యాచ్‌లో భాగంగా సోమవారం ఫ్రాన్సులోని మెరిగ్నాక్‌ వైమానిక కేంద్రం నుంచి 5 రఫేల్‌ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్‌లోని అంబాలా వైమానిక స్థావరానికి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నాయి. మార్గమధ్యంలో యూఏఈలోని అల్‌ధఫ్రా ఎయిర్‌బేస్‌లో సోమవారం సాయంత్రం దిగాయి. ఫ్రాన్సుకు చెందిన డసో ఏవియేషన్‌ సంస్థ ఈ విమానాలను తయారు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి రఫేల్‌ జెట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్సు పర్యటన సందర్భంగా డసో అందజేసింది. చదవండి : రా.. రా.. రఫేల్‌!

Advertisement
 
Advertisement