
సాక్షి,న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లను నియమించారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్,గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతి రాజు (Pusapati Ashok Gajapathi Raju) ,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవిందర్ గుప్తా నియమిస్తూ సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు
అశోక్ గజపతి రాజు రాజకీయ నేపథ్యం
పూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నేతగా, కేంద్ర మాజీ మంత్రిగా రాజకీయాల్లో రాణించారు. తాజాగా ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్‌గా నియమించారు. అశోక్ గజపతిరాజు ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో ఎంపీగా గెలిచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఫైనాన్స్ వంటి కీలక శాఖలను నిర్వహించారు.
రాజవంశీయ నేపథ్యం
అశోక్ గజపతి రాజు తండ్రి పూసపాటి విజయరామ గజపతి రాజు. విజయనగరం సంస్థానపు చివరి మహారాజు. అశోక్ గతపతి రాజు రాజకీయాలతో పాటు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సేవలందించారు. ఇవాళ గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజును నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారికంగా ప్రకటించింది.