బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు
కులకర్ణిని ప్రశ్నించడంతో వెలుగులోకి జీవశాస్త్ర అధ్యాపకురాలి పేరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్–యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో మరో పెద్ద తలకాయను పోలీసులు అరెస్ట్‌చేశారు. జీవశాస్త్ర అధ్యాపకురాలిగా కొనసాగుతూ నీట్–యూజీకి సంబంధించిన నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వారి పేపర్ సెట్టింట్ కమిటీలో సభ్యురాలిగా ఉన్న పుణెకు చెందిన మనీషా గురునాథ్ మంధరేను సీబీఐ అధికారులు శనివారం అరెస్ట్‌చేశారు. ఇప్పటికే అరెస్టయిన మరో మాస్టర్‌మైండ్, రసాయనశాస్త్ర అధ్యాపకుడు పీవీ కులకర్ణిని లోతుగా ప్రశ్నించడంతో ఈమె పేరు బయటపెట్టాడని పోలీసు అధికారులు తెలిపారు.
బయాలజీ పేపర్ లీకేజీకి ఈమె ప్రధాన కారకురాలు అని సీబీఐ పేర్కొంది. మనీషాను ఢిల్లీకి తీసుకొచ్చి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారించి, ఆమె నేరాన్ని నిర్ధారించుకున్నాక అరెస్ట్‌చేశారు. నీట్–యూజీ పరీక్ష ప్రక్రియలో ఈమె భాగస్వామిగా ఉన్నారు. ఈమెను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా గతంలో ఎన్‌టీఏ నియమించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో ఉండటంతో ఈమె బాటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను నేరుగా పరిశీలించే అధికారం పొందారు. ఆ అధికారాన్ని దురి్వనియోగంచేసినట్లు తేలింది. ఈ ప్రశ్నలను తనకు లక్షల రూపాయలు చెల్లించిన కొద్దిమంది నీట్–యూజీ అభ్యర్థులకు చేరవేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది.
ఎవరీ మనీషా?
మహారాష్ట్రకు చెందిన మనీషా వృత్తిరీత్యా బాటనీ లెక్చరర్. పుణెలోని మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, కామర్స్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఐదారేళ్లుగా ఎన్‌టీఏలో పనిచేస్తున్నారు. ఈ ఏడాది నీట్–యూజీ ప్రవేశపరీక్షకు సంబంధించి బాటనీ, జువాలజీ విభాగంలో రావాల్సిన ప్రశ్నల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ఆయా ప్రశ్నపత్రాల తుదిరూపకల్పనలో పాలుపంచుకున్నారు. ఇటు జాతీయస్థాయి సంస్థలో కీలకభూమిక పోషిస్తూనే పుణె కాలేజీతో సత్సంబంధాలు కొనసాగించడం గమనార్హం. రహస్యంగా ఉంచాల్సిన క్వశ్చన్ పేపర్లను తరచిచూసే సర్వాధికారం ఉండటంతో వాటిని ఈమె తస్కరించారు.
ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థుల జాబితాను వాఘ్మరే అనే మరో నిందితుని ద్వారా తెప్పించుకుని వాళ్లకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లను పుణెలోని సొంతింట్లో ప్రత్యేక కోచింగ్ క్లాసులపేరిట అందజేశారు. వాఘ్మరేను నాలుగు రోజుల క్రితమే సీబీఐ అరెస్ట్‌చేయడం తెల్సిందే. ఈ బాటనీ, జువాలజీ ప్రశ్నలు, వాటి ఆప్షన్లు, జవాబులు అచ్చుగుద్దినట్లుగా 2026 నీట్–యూజీ ఎంట్రన్స్ బయాలజీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలాయని సీబీఐ వెల్లడించింది. పేపర్ సెట్టింగ్ కమిటీలో అంతర్గత వ్యక్తులు మొదలు మధ్యవర్తులు, అభ్యర్థుల దాకా అన్ని స్థాయిలో పకడ్బందీ నెట్‌వర్క్ ద్వారా ప్రశ్నపత్రాలను లీక్‌చేశారు. కులకర్ణి, వాఘ్మరేలను 10 రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తుర్వులిచ్చింది.
వేట వేగవంతం
ఈ ఉదంతంలో ఇంకెంత మంది సూత్రధారులు, పాత్రధారులు దాక్కున్నారనేది కనిపెట్టి సంకెళ్లు వేసేందుకు సీబీఐ విస్తృతస్థాయిలో దర్యాప్తును వేగవంతంచేసింది. గత 24 గంటల్లో ఆరు వేర్వేరు ప్రాంతాల్లో చాలా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను సీజ్‌చేసింది. డబ్బులు ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిగిన కొన్ని బ్యాంక్ ఖాతాల వివరాలు, నేరపూరిత డాక్యుమెంట్లను సేకరించింది. వీటన్నింటీ మధ్య ఉన్న సంబంధాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. వాఘ్మరీ ద్వారానే ప్రశ్నలను కులకర్ణి ఇతర పరీక్షార్థులకు చేరవేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, అహల్యానగర్‌లలో మొత్తం 9 మందిని అరెస్ట్‌చేశారు. వాళ్ల జాబితా..
1. మనీషా గురునాథ్(బాటనీ లెక్చరర్)
2. పీవీ కులకర్ణి( రసాయనశాస్త్ర అధ్యాపకుడు)
3. వాఘ్మరే(విద్యార్థులను పోగుచేసిన వ్యక్తి)
4. ధనంజయ్ లోఖండా(అహల్యానగర్‌వాసి)
5. శుభం ఖైర్నర్( నాసిక్ వాసి)
6. మంగీ లాల్ బివాల్( జైపూర్‌వాసి)
7. వికాస్ బిలాల్( జైపూర్‌వాసి)
8. దినేశ్ బిలాల్( జైపూర్‌వాసి)
9. యశ్ యాదవ్(గురుగ్రామ్‌వాసి)


