పంజాబ్‌ సీఎం ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా

Prashant Kishor Quits As Principal Adviser To Punjab CM - Sakshi

చండీగఢ్‌: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌కు ఇన్నాళ్లు ప్రధాన సలహాదారు (ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌)గా కొనసాగగా తాజాగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘తాత్కాలికంగా ప్రజా జీవితానికి విరామం ఇస్తున్నా’ అని పేర్కొంటూ గురువారం రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి పంపించారు. ఈ పరిణామం జాతీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. 

‘నా భవిష్యత్‌ చర్యల కోసం ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగలేకపోతున్నా. ఈ విషయం మీకు కూడా తెలుసు. తాత్కాలికంగా ప్రజా జీవితం నుంచి కొంత విరామం కోరుకుంటున్నా. సలహాదారు పదవిని స్వీకరించలేను. అన్యథా భావించకుండా నా విజ్ఞప్తిని పరిశీలించి ఆ బాధ్యతల నుంచి నన్ను తొలగించాలి’ అని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌కు లేఖ రాశారు.

ప్రశాంత్‌ కిశోర్‌ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో సీఎంకు తెలుసు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పలుమార్లు రాహుల్‌, ప్రియాంకగాంధీలతో పీకే సమావేశమయ్యారు. పంజాబ్‌ సీఎం సలహాదారుగా ఈ ఏడాది మార్చిలో పీకే నియమితులయ్యారు. ప్రశాంత్‌ కిశోర్‌ రాజీనామా వెనకాల వేరే ప్రణాళిక ఉందని సమాచారం. వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం పని చేయనున్నారని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ పదవికి రాజీనామా చేశారని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు పార్టీలో చేరితే కాంగ్రెస్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక పదవిలోనే ఉండాలని ఉండడంతో ఈ రాజీనామా చేశారని చర్చ కొనసాగుతోంది. తాజాగా ఈ పదవి నుంచి వైదొలగడంతో ఆయన రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top