అన్నానగర్: మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడి చేసిన ముగ్గురికి జైలు శిక్ష, దీనికి సహకరించిన బాలిక తల్లికి 95 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శివగంగై పోక్సో కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. వివరాలు.. శివగంగై జిల్లా తిరుపత్తూరు ప్రాంతానికి చెందిన అక్బర్ అలీ అంబలం (71), డ్రైవర్. అరియలూరుకు చెందిన శరవణన్ (41) కూలీ.
పుదుక్కోట్టై జిల్లా అళగియనాయకిపురం గ్రామానికి చెందిన మురుగేషన్ (55). ముగ్గురూ కలిసి 2021లో 15 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక తల్లి కూడా దీనికి సహకరించడం గమనార్హం! తిరుపత్తూరు అఖిల మహిళా పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. అక్బర్ అలీ, శరవణన్, మురుగేశన్, బాలిక తల్లి మరో ఇద్దరు మహిళలతో సహా ఆరుగురిని అరెస్టు చేశారు. శివగంగైలోని పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు శుక్రవారం తుది విచారణకు వచ్చింది.
నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి గోకుల్ మురుగన్, నిందితుడు అక్బర్ అలీ అంబలానికి 50 ఏళ్ల జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా, శరవణకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, మురుగేషన్‌కు 25 ఏళ్లు జైలు, రూ.11 వేలు జరిమానా, బాలిక తల్లికి 95 ఏళ్లు జైలు శిక్ష, రూ.5వేల జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. మిగతా ఇద్దరు మహిళలను నిర్దోషులుగా విడుదల చేశారు. బాధితురాలికి నష్టపరిహారంగా రూ. 5 లక్షలు చెల్లించాలని కూడా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.


