
రూ.36 వేల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం
పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్‌ఫుడ్‌గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్‌లో సాగవుతోంది.
మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలాలను అందుకుంటోందన్నారు.
ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.