కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కళాశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను సినీ ఫక్కీలో పోలీసులు అరెస్ట్ చేశారు. కోయంబత్తూరు నగర పోలీసు కమిషనర్ శరవణ సుందర్ నిందితుల అరెస్టును ధృవీకరించారు. అరెస్టు సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితుల కాళ్లపై పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని శరవణ సుందర్ పేర్కొన్నారు.
కోయంబత్తూరు నగర శివార్లలోని వెల్లకినారులో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా, వారు అక్కడి నుంచి తప్పించుకోబోయారు. ఈ నేపధ్యంలో పోలీసులు వారి కాళ్లపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్‌లను కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారని శరవణ సుందర్ ‘ఏఎన్‌ఐ’కి తెలిపారు.
కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ఆదివారం సాయంత్రం ఒక విద్యార్థినిని ముగ్గురు మువకులు అపహరించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. దాడి జరిగిన సమయంలో ఆ విద్యార్థిని తన స్నేహితునితోపాటు కారులో ఉన్నారని ‘హిందుస్తాన్ టైమ్స్’ గతంలో నివేదించింది. ఆ సమయంలో ముగ్గురు నిందితులు కలిసి కారు అద్దాలు పగలగొట్టి, ఆ యువతిని, అతని స్నేహితుడిని కొట్టి, గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి, ఆమెపై అత్యాచారం చేశారని తెలియవచ్చింది.
ఈ ఘటన దరిమిలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై తమిళనాడులో క్షీణిస్తున్న శాంతిభద్రతలను, మహిళలు, పిల్లలపై పెరుగుతున్న లైంగిక నేరాలపై ‘ఎక్స్’ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకె అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇలాంటి సంఘటనలు పెరిగిపోయాయని, సామాజిక వ్యతిరేక శక్తులు అటు చట్టానికి, ఇటు పోలీసులకు భయపడటం లేదని అన్నామలై ఆరోపించారు. డీఎంకే మంత్రుల నుండి పోలీసు అధికారుల వరకు అందరూ న్యాయాన్ని కాపాడే బదులు నేరస్తులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లున్నదని అన్నామలై అన్నారు.
ఇది కూడా చదవండి: భారత ట్రక్కు డ్రైవర్ కేసులో మరో మలుపు


