న్యూయార్క్: ఇటీవల కాలిఫోర్నియాలో ముగ్గురు మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన ట్రక్కు డ్రైవర్ కేసు మరో మలుపు తిరిగింది. అతను మద్యం మత్తులో వాహనం నడపడం లేదని, అది నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదమని విచారణలో తేలిందని యూఎస్ అధికారులు మీడియాకు తెలిపారు. ప్రాథమిక నివేదికలో సదరు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని పేర్కొన్నారు.
యుబా సిటీకి చెందిన 21 ఏళ్ల జషన్‌ప్రీత్ సింగ్‌ను అక్టోబర్ 21న మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడనే అనుమానంతో అమెరికా పోలీసులు అరెస్టు చేసి, అతనిపై హత్యా నేరం మోపారు. నాడు కాలిఫోర్నియాలోని ఒంటారియోలో డ్రైవర్ జషన్‌ప్రీత్ సింగ్ కారణంగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ జషన్‌ప్రీత్ సింగ్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో మత్తు కలిగించే పదార్థాలు ఏవీ లేవని నిర్ధారణ అయ్యింది. అయితే వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో జరిగిన హత్యగా దీనిని గుర్తిస్తున్నట్లు శాన్ బెర్నార్డినో కౌంటీ అటార్నీ కార్యాలయం మీడియాకు తెలిపింది.
డాష్‌క్యామ్ ఫుటేజ్‌లో నాడు సింగ్ రద్దీగా ఉన్న ట్రాఫిక్‌లో అధిక వేగంతో ట్రక్కును నడిపినట్లు తేలింది. ఇది ముగ్గురు ప్రాణాలను బలిగొన్న దారుణమైన విషాదం. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. నిందితుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని శాన్ బెర్నార్డినో కౌంటీ జిల్లా న్యాయవాది జాసన్ ఆండర్సన్ పేర్కొన్నారు. సింగ్‌కు ఇప్పుడే బెయిల్ ఇవ్వలేమని, నేరం తీవ్రత, ప్రమాదం తీరు ఆధారంగా బెయిల్ విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా అక్రమ వలసదారుడైన సింగ్ 2022లో యూఎస్ దక్షిణ సరిహద్దును దాటాడు. అతని ఇమ్మిగ్రేషన్ విచారణ పెండింగ్‌లో ఉందని గత నెలలో ‘ఫాక్స్ న్యూస్’ పేర్కొంది.
ఇది కూడా చదవండి: మళ్లీ భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్


