
ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై ప్రధాని మోదీ ధ్వజం
అక్రమ వలసదారులకు రక్షణ కల్పిస్తున్నాయని ఆరోపణ
బిహార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్‌లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్‌లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్‌ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు.
‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు.
ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు.
ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్‌డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్‌పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్‌కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్‌లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు.