గృహప్రవేశాలకు సరికొత్త ఆవిష్కరణ
నాడు బంగారుసీతతో రామయ్య అశ్వమేధయాగం..
నేడు రోబో ఆవుతో గృహప్రవేశం
కాలం మారినా సంప్రదాయం మారనేలేదు..
భారతదేశం సంస్కృతి సంప్రాదయాలకు పుట్టిల్లు.. భారతీయులు దేశవిదేశాలకు వెళ్ళిపోయినా.. అక్కడ పెద్దపెద్ద ఉద్యోగాల్లో స్థిరపడినా.. సాంకేతికతను ఒంటబట్టించుకున్నా సొంత ఇంటి వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ సాంప్రదాయానికే జై కొడతారు.. శాస్త్ర విజ్ఞానం.. సాంకేతికత ఆకాశాన్ని తాకుతున్న. భారతీయ పద్ధతులు.. సంప్రదాయాలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. సంప్రదాయం అంటే గుర్తొచ్చింది.. ఎవరికైనా సొంత ఇల్లు అనేది ఒక కల. ఆ ఇంటి కలను నెరవేర్చుకునే దానిలో బంధుమిత్రుల సమక్షంలో సత్యనారాయణ వ్రతం చేయించి.. గృహప్రవేశం చేసుకుని పదిమందితో ఆనందాన్ని పంచుకోవడం ఒక మధురానుభూతి.
పట్టణాలు.. నగరాల్లో గృహప్రవేశం అంటే అదొక పెద్ద క్రతువు.. బ్రాహ్మణుణ్ణి వెతికిపట్టుకోవాలి.. పూజాద్రవ్యాలు సమకూర్చుకోవాలి.. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంట్లోకి గోమాతను తీసుకెళ్లడం ఇంకో ఎత్తు. ఇప్పుడు పట్టణాల్లో గోమాతను ఒక పూటకు అద్దెకు ఇచ్చేవాళ్ళు దొరుకుతున్నారు. అక్కడక్కడా గోడలమీద ' గృహప్రవేశానికి ఆవుదూడ లభించును' అనే బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. ఆపూటకు సదరు రైతు ఆవును మన ఇంట్లోకి తీసుకొచ్చి ఇల్లంతా తిప్పి ఇంటిలోని మైలను బయటకు పంపించి సంపదను .. ఆరోగ్యాన్ని అవుద్వారా మన ఇంట్లో నెలకొల్పుతాడని హిందువుల నమ్మకం. అయితే కొన్ని పట్టణాల్లో ఆవుదూడ లభ్యత కూడా కష్టమే.. అలాంటపుడు గృహప్రవేశం ఎలా ? ఏమి చేద్దాం.. గృహప్రవేశం ఆపలేం.. అలాగని ఆవు లేకుండా గృహప్రవేశం చేసి సంప్రదాయాన్ని విస్మరించలేం కదా.. సరే.. కష్టమో నష్టమో. ఏదోలా ప్రయాసపడి ఆవును సంపాదిద్దాం.. ఇల్లు.. అది గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఆవు దూడ వస్తాయి.. ఫర్లేదు.. మరి ఇప్పుడు ఈ మహానగరంలో పది.. పాతిక అంతస్తుల అపార్టుమెంట్లలోకి ఆవుదూడ ఎలా వస్తాయి.. అన్ని మెట్లు ఎలా ఎక్కుతాయి.. సాధ్యం కాదు కదా.. ఒకవేళ అంత ఎత్తుకు తీసుకెళ్తే అది ఈ మెట్లు ఎక్కలేక ఏమైనా ఇబ్బంది పడితే.. ఎలా.. అందుకే ఇప్పుడు శాస్త్రం .... ఇంకోసాంకేతిక శాస్త్రాన్ని ఆశ్రయించింది.
అందుకే పెద్దపెద్ద అంతస్తులోకి ఆవులు ఎక్కలేవు.. కాబట్టి రోబోటిక్ అవును రూపొందించారు.. అది సాంకేతికతతో నడుస్తూ ఉంటుంది. దానిమేడలో అందమైన పూలదండ ధరించి బుడిబుడి నడకలతో ఇల్లంతా కలియదిరుగుతూ శుభాన్ని.. సంపదను మోసుకొస్తూ.. ఇంటి యజమానికి మంచిని కలగజేస్తుంది. ఇదేంటి.. అవంటే ఆవు కదా ఉండాలి అంటారేమో. రోజులు మారాయి.. ఆవులాంటి రోబో.. అదే రోబోటిక్ ఆవు .. గోమాతలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి.. అవి ఇంట్లో అలా కదులుతూ వెళ్తుంటే అచ్చం కామధేనువు కదిలొస్తున్నంత సంబరపడుతూ ఇంటి యజమాని తన గృహప్రవేశ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటే ఇదే మరి.. నిజమైన ఆవు దొరకలేదని గృహప్రవేశం ఆగిపోదు.. ఆనాడు శ్రీరాముడు బంగారు సీత ప్రతిమతో అశ్వమేధయాగం చేసినట్లు నేడు మనవాళ్ళు రోబోటిక్ గోమాతతో గృహప్రవేశాలు చేస్తున్నారు.. టెక్నాలజీ మారింది కానీ సంప్రదాయం మారలేదు..
- సిమ్మాదిరప్పన్న


