బిహార్‌లో మళ్లీ మాదే విజయం
ప్రధాని నరేంద్ర మోదీ ధీమా
రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం
నేరగాళ్ల కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపు
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విజయం మళ్లీ తమదేనని ధీమా వ్యక్తంచేశారు. విపక్ష ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమిని బెయిల్‌పై బయటకు వచ్చిన నేరగాళ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్‌లో సుడిగాలి పర్యటనలు చేశారు. జన నాయక్, భారతరత్న కర్పూరీ ఠాకూర్ సొంత గ్రామాన్ని సందర్శించారు.
సమస్తీపూర్, బెగూసరాయ్ జిల్లాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సొంత ప్రయోజనాలు మాత్రమే కాపాడుకొనే ‘ఇండియా’ కూటమిని పక్కనపెట్టాలని, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ శ్రేణులు ‘జన నాయక్’ అని సంబోధించడాన్ని మోదీ తప్పుపట్టారు. జన నాయక్ అంటే కర్పూరీ ఠాకూర్ మాత్రమేనని స్పష్టంచేశారు. కర్పూర్ ఠాకూర్‌కు ప్రజలిచి్చన బిరుదును దొంగిలించే ప్రయత్నాలు మానుకోవాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
సుపరిపాలనను ఆదరించాలి
‘‘2005లో బిహార్ ప్రజలు జంగిల్‌రాజ్‌కు ముగింపు పలికారు. ఆర్జేడీ–కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడేశారు. ఈ విషయం ఇప్పటి యువత తెలుసుకోవాలి. యువత భుజస్కంధాలపై పెద్ద బాధ్యత ఉంది. సుపరిపాలనను ఆదరించాలి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి. గుజరాత్, మధ్యప్రదేశ్, హరియాణాతోపాటు మహారాష్ట్రలోనూ బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. బిహార్‌లో సైతం పాత రికార్డులను తిరగరాయడం తథ్యం. నయీ రఫ్తార్
సే చలేగా బిహార్, జబ్ ఫిర్ సే ఆయేగీ ఎన్డీఏ సర్కార్(ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ వస్తే బిహార్ కొత్త వేగంతో ముందుకెళ్తుంది)
వారిలో అహంకారం తగ్గలేదు
విపక్ష ఇండియా కూటమిలో కీచులాటలు జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. అది మహాగఠ్‌బంధన్ కాదు.. మహాలాఠ్‌బంధన్. ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు అత్యంత అవినీతిపరులు. వారంతా బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. దశాబ్దాలుగా అధికారంలో లేకున్నా వారిలో అహంకారం తగ్గలేదు. సొంత కూటమిలోని పారీ్టలను బయటకు తరిమేశారు. అలాంటి వారికి ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి. జంగిల్‌రాజ్ వల్ల మహిళలు ఎంతగానో నష్టపోయారు. బాధితులుగా మిగిలారు.
మహిళల సంక్షేమం, సాధికారత కోసం రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే పార్లమెంట్‌లో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు వ్యతిరేకించారు. ఆ నాయకులు ఓట్ల కోసం వస్తే తలుపులు మూసివేయండి. మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమికి లేదు. నిజానికి ఆ నాయకులే అసలు సమస్య. గతంలో వరద బాధితులను ఆదుకోవాల్సింది పోయి అవహేళన చేశారు. ఆర్జేడీ–కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారు. అప్పటి పాలకులు ఉద్యోగాల పేరుతో భూములు లాక్కున్నారు. కానీ, యువతకు ఉపాధి కలి్పంచలేదు. జంగిల్‌రాజ్ నుంచి బిహార్‌కు ఎన్డీఏ విముక్తి కలి్పంచింది. ప్రస్తుతం బిహార్ ప్రజలకు లాంతరు (ఆర్జేడీ ఎన్నికల గుర్తు) అవసరం లేదు. ఇప్పుడు వారి మొబైల్ ఫోన్లలో ఫ్లాష్‌లైట్లు ఉన్నాయి.
నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం
కేంద్రంలో 11 ఏళ్ల ఎన్డీఏ పాలనలో బిహార్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. యూపీఏ పాలనతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా నిధులు అందజేశాం. కనీస అవసరాల కోసం ఒకప్పుడు ఇతర రాష్ట్రాలపై ఆధారపడిన బిహార్ ఇప్పుడు స్వయం సమృద్ధి సాధిస్తోంది. చేపలు, మఖానాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. బిహార్ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేశాం. మఖానా సాగు, మార్కెటింగ్‌కు దోహదపడుతోంది. బిహార్‌లో నక్సలిజం సమస్య చాలావరకు తగ్గిపోయింది. గతంలో దాదాపు 18 జిల్లాల్లో నక్సలైట్ల ప్రభావం ఉండేది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం. ఇదీ నా గ్యారంటీ.
పరివార్ వల్ల సీతారాం కేసరికి అవమానాలు
పేద కుటుంబంలో జని్మంచిన నేను ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అందుకు కర్పూరీ ఠాకూర్ ఇచి్చన స్ఫూర్తే కారణం. పేదలు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతులుగా మారగలరని ఆయన నిరూపించారు. బిహార్‌కు గర్వకారణమైన సీతారాం కేసరిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది. వెనుకబడిన తరగతికి చెందిన కేసరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కానీ, పరివార్(నెహ్రూ–గాంధీ కుటుంబం) వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆయనను బాత్‌రూమ్‌లో బంధించారు. అనంతరం వీధుల్లోకి నెట్టేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆయన నుంచి దొంగిలించారు’’ అని ప్రధాని మోదీ మండిపడ్డారు. తన పట్ల నిరంతరం విశ్వాసం వ్యక్తం చేస్తున్నందుకు బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చామని, వస్తువుల ధరలు తగ్గిపోయాయని చెప్పారు. రాబోయే ఛత్ పండుగతోపాటు ఆదా
(బచత్) ఉత్సవం కూడా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.


