అది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ‘ఎక్స్‌పైరీ డేట్’
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం
తొలి విడతలో భారీ ఓటింగ్ ప్రజల ఆకాంక్షకు నిదర్శనం
మార్పునకు అనుకూలంగా అఖండమైన తీర్పు రాబోతోంది
బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ స్పషీ్టకరణ
ఎన్నికల్లో హింస తగ్గినందుకు ఎన్నికల సంఘానికి అభినందనలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మే 4వ తేదీయే ‘ఎక్స్‌పైరీ డేట్’ అని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో 15 ఏళ్ల సిండికేట్ వ్యవస్థ, మహా జంగిల్‌రాజ్ అంతమైపోతుందని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ గురువారం బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు జరిగే మథురాపూర్, కృష్ణానగర్ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు.
తొలి విడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదు కావడం తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఓటర్లకు అభినందనలు తెలియజేశారు. ఈ ఓటింగ్‌ను ‘మార్పు కోసం ఇచ్చిన తీర్పు’గా అభివరి్ణంచారు. బెంగాల్ ఓటర్ల నిర్ణయం మేరకు మార్పునకు అనుకూలంగా అఖండమైన తీర్పు రాబోతోందని అన్నారు. అధికార పార్టీ సృష్టించిన భయాన్ని బీజేపీ ఇస్తున్న భరోసా చిత్తుచిత్తుగా ఓడించబోతోందని స్పష్టంచేశారు. బీజేపీ ప్రభంజనం సృష్టించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో భారీ ఓటింగ్ నమోదైన ప్రతిచోటా బీజేపీ విజయాలు సాధిస్తోందని వెల్లడించారు.
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక విజయోజత్సవాలు నిర్వహిస్తామని, బెంగాల్ ప్రజలకు మిఠాయిలతోపాటు ఝాల్‌మురీ పంపిణీ చేస్తామని మోదీ ప్రకటించారు. బెంగాల్‌లో తాను ఝాల్‌మురీ రుచిని ఆస్వాదించడం కొందరికి పిడుగుపాటు లాంటి షాక్ ఇచ్చిందన్నారు. తాను ఝాల్‌మురీ రుచి చూస్తే తృణమూల్ కాంగ్రెస్ నాయకులకు మిరపకాయల ఘాటు తగులుతోందని ఎద్దేవా చేశారు. తొలి దశ ఎన్నికల సందర్భంగా హింసాకాండను కనిష్ట స్థాయిలో ఉంచినందుకు ఎన్నికల సంఘాన్ని అభినందించారు. 50 ఏళ్ల బెంగాల్ ఎన్నికల చరిత్రలో హింసాత్మక ఘటనలు కనిష్ట స్థాయికి తగ్గడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..
అరాచకం ఆగాలంటే బీజేపీ ముఖ్యమంత్రి రావాలి
‘‘బెంగాల్‌లో లంచాలు లేకుండా పనులు జరిగే రంగం ఒక్కటి కూడా లేదు. టీఎంసీ సిండికేట్లు, వారి మధ్యవర్తులు కట్ మనీ తీసుకోని రంగమే లేదు. 15 ఏళ్ల సిండికేట్ వ్యవస్థ, మహా జంగిల్‌రాజ్‌కు కాలం చెల్లిపోయింది. ఆ గడువు మే 4వ తేదీ. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసినందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో వంతెనలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చివరకు ప్రజలను దగా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్‌లో అమలు కాకుండా అడ్డుకున్నారు. అభివృద్ధి పనుల కోసం కేంద్రమిచ్చిన నిధులను స్వాహా చేశారు.
ఈ అరాచకం ఆగాలంటే రాష్ట్రంలో బీజేపీ ముఖ్యమంత్రి రావాలి. 2029 నుంచి మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేము సంకల్పిస్తే టీఎంసీ, కాంగ్రెస్ పారీ్టలు ఒక్కటై అడ్డుకున్నాయి. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. చొరబాటుదార్లపై కఠినంగా వ్యవహరిస్తాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక వారిని బెంగాల్ నుంచి బయటకు పంపిస్తాం. మన స్థానిక వనరులను దోచుకుంటూ దేశ భద్రతకు ముప్పుగా మారినవారిని ఎలా సహిస్తాం? చొరబాటుదార్లు సముద్ర మార్గాల ద్వారా రహస్యంగా మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అండతో ఇక్కడ స్థిరపడుతున్నారు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు.


