PM Modi: కోర్టుల్లో స్థానిక భాష

PM Narendra Modi calls for ease of justice with laws in simple local languages - Sakshi

చట్టాలనూ స్థానిక భాషల్లో రాయాలి

మాతృభాషలోనూ న్యాయ విద్య

అప్పుడే అందరికీ సత్వర న్యాయం

ఆలిండియా న్యాయ మంత్రుల సదస్సులో ప్రధాని సందేశం

కేవడియా (గుజరాత్‌): న్యాయమందే ప్రక్రియలో ఆలస్యం దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సమర్థ దేశం, సామరస్యపూర్వక సమాజం నెలకొనాలంటే బాధితుల పట్ల సానుభూతితో స్పందించే న్యాయవ్యవస్థ చాలా అవసరమన్నారు. ‘‘కఠినమైన న్యాయ పరిభాష పౌరులకు అడ్డంకిగా నిలిచే పరిస్థితి మారాలి. కొత్త చట్టాలను స్థానిక భాషల్లో రాయాలి.

కోర్టుల్లో స్థానిక భాషల వాడకం పెరగాలి. తద్వారా న్యాయప్రక్రియను మరింత సులభతరం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని చెప్పారు. గుజరాత్‌లోని కేవడియా సమీపంలో ఏక్తానగర్‌లో శనివారం మొదలైన రెండు రోజుల అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల సదస్సును ఉద్దేశించి మోదీ వీడియో సందేశమిచ్చారు. ఈ ఉద్దేశంతోనే బ్రిటిష్‌ కాలం నాటి 1,500కు పైగా కాలం చెల్లిన, పనికిరాని పాత చట్టాలను తమ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లలో బుట్టదాఖలు చేసిందన్నారు.

‘‘లోక్‌ అదాలత్‌ల వంటి ప్రత్యామ్నాయ న్యాయ ప్రక్రియలు కోర్టులపై భారాన్ని తగ్గించడంతో దోహదపడుతున్నాయి. పేదలకు సులువుగా సత్వర న్యాయమూ దొరుకుతోంది. చట్టాల్లోని కాఠిన్యం, గోప్యత లేనిపోని సంక్లిష్టతలకు దారి తీస్తుంది. అలాగాక అవి సామాన్యునికి కూడా అర్థమయ్యేలా ఉంటే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. పలు దేశాల్లో చట్టాలు చేసినప్పుడు అందులోని న్యాయపరమైన పారిభాషిక పదాలను అందరికీ వివరిస్తారు.

స్థానిక భాషలోనూ రాస్తారు. అలా అందరికీ అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొన్ని దేశాల్లో చట్టాలు చేసేటప్పుడే అవి ఎంతకాలం పాటు అమల్లో ఉండేదీ ముందే నిర్ణయిస్తారు. మనమూ వీటిని అందిపుచ్చుకోవాలి. యువతకు న్యాయ విద్యను కూడా స్థానిక భాషల్లో అందించేందుకు చర్యలు తీసుకోవాలి’’ అన్నారు.  సవాళ్లను అధిగమించేందుకు భారత న్యాయవ్యవస్థ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

ఇంధనావసరాలు తీర్చేందుకు ఉమ్మడి కృషి
పరిశోధన సంస్థలకు మోదీ పిలుపు
న్యూఢిల్లీ: నానాటికీ పెరిగిపోతున్న దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు పరిశ్రమ, పరిశోధన, విద్య తదితర రంగాలన్నీ ఉమ్మడిగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.అన్ని రంగాల్లోనూ శాస్త్రీయ దృక్పథాన్ని, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ వంటివాటి వాడకాన్ని పెంచాలన్నారు. శనివారం కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) భేటీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత్‌ను ప్రపంచ సారథిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్‌ 2047 దిశగా కృషి చేయాలని సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top