భారత్‌లో ఈ 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలని తెలుసా?

Places In India Where Special Permission Required To Travel - Sakshi

వైవిధ్యమైన సంస్కృతికి, గొప్ప వారసత్వ సంపదకు నిలయం భారత్. పర్యాటకులను కట్టిపడేసే ఎన్నో ప్రకృతి సోయాగాలు మన దేశంలో ఉన్నాయి. అయితే భారత ఉపఖండంలోని మొత్తం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించడం ఒకేలా ఉండదు. ముఖ్యంగా 6 పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా ఇన్నర్ లోన్ పర్మిట్(ఐఎల్‌పీ) తీసుకోవాల్సి ఉంటుంది. ‍ఇది లేకపోతే ఆ చోటుకు అసలు అనుమతించరు.

ఐఎల్‌పీ పర్మిషన్ అంటే?
ఇన్నర్ లోన్ పర్మిట్‌ అనేది కొత్తదేమీ కాదు. ఎప్పటి నుంచో అమల్లో ఉన్నదే. ఇతర దేశాలతో సరిహద్దు పంచుకునే సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు మాత్రమే ఐఎల్‌పీ తీసుకోవాల్సి ఉంటుంది. తరచూ పర్యటనలకు వెళ్లేవారికి దీని గురించి తెలిసే ఉంటుంది. ఆదివాసీ తెగల సంక్షేమంతో పాటు పర్యాటకులకు భద్రత కల్పించడంలో ఇది ఉపయోగపడుతుంది.

ఆరు ప్రదేశాలు ఇవే..
అరుణాచల్ ప్రదేశ్: గొప్ప సంస్కృతికి నిలయమైన ఈ ఈశాన్య రాష్ట్రం.. చైనా, భూటాన్, మయన్మార్‌ దేశాలతో సరిహద్దును పంచుకుంటోంది. అందుకే ఈ ప్రాంతంలో పర్యటించాలనుకునే సందర్శకులు కోల్‌కతా, ఢిల్లీ, షిల్లాంగ్, గువాహటి రెసిడెంట్ కమిషనర్ల నుంచి ఐఎల్‌పీ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఒక్కో సందర్శకుడు రూ.100 చెల్లించాలి. నెల రోజుల పాటు అనుమతి ఉంటుంది.

నాగలాండ్..
సంప్రదాయ తెగలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్‌తో సరిహద్దు కలిగి ఉంది. ఈ సున్నితమైన ప్రాంతంలో పర్యటించాలనుకునే వారు ఢిల్లీ, కోల్‌కతా, కోహిమా, దిమాపూర్, షిల్లాంగ్, మొక్కోచుంగ్ డిప్యూటీ కమిషనర్ల నుంచి అనుమతి తీసుకోవచ్చు.

లక్షద్వీప్..
భారత్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఇదీ ఒకటి. అందమైన బీచ్‌లు, రుచికరమైన ఆహారానికి నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించాలంటే పోలీస్ క్లియరెన్స్‌తో పాటు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి.

మిజోరం..
ప్రకృతి సోయగాలకు నిలయమైన ఈ రాష్ట్రం మయన్మార్, బంగ్లాదేశ్‌తో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఆదివాసీలకు నిలయమైన ఈ ప్రాంతానికి వెళ్లాలంటే ఏఎల్‌పీ తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు   సిల్చార్, కోల్‌కతా, షిల్లాంగ్, ఢిల్లీ, గువాహటి లీయాసోన్ అధికారుల నుంచి దీన్ని పొందాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విమానంలో వెళ్తే.. ఎయిర్‌పోర్టులోని సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి ప్రత్యేక పాసులు తీసుకోవాలి.

సిక్కిం..
భారత్‌లోని అతిచిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఇదీ ఒకటి. హిమాలయాలకు ప్రవేశ ద్వారం. అందమైన పచ్ఛికభూములు, అద్భుతమైన వంటకాలు, అనేక మఠాలు, స్పటిక సరస్సులు, కట్టిపడేసే ప్రకృతి అందాలకు నిలయం. మునుపెన్నడూ పొందని అనుభూతిని పర్యాటకులు ఇక్కడ పొందుతారు. సిక్కింలోని సోమ్‌గో, బాబా మందిర్ ట్రిప్, సింగలీలా ట్రెక్, నాథ్లా పాస్, జోంగ్రీ ట్రెక్, తంగు చోప్తా వ్యాలీ ట్రిప్, యుమెసామ్‌డాంగ్, యమ్‌తాంగ్, జోరో పాయింట్ ట్రిప్ వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి.

లద్దాక్..
ప్రతి పర్యాటకుడు ఒక్కసారైనా సందర్శించాలనుకునే ప్రాంతం ఇది. ఐఎల్‌పీ లేనిదే ఇక్కడకు రానివ్వరు. నుబ్రా వ్యాలీ, ఖార్‌డంగ్ లా పాస్, తో మోరిరి సరస్సు, పాంగాంగ్ త్సో సరస్సు, దాహ్, హను విలేజ్, న్యోమా, టర్టక్, డిగర్ లా, తంగ్యార్ వంటి ప్రదేశాలకు వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top