మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ | Sakshi
Sakshi News home page

మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ

Published Fri, Mar 5 2021 9:17 PM

PDP Chief Mehbooba Mufti Issued Summons by ED Over Money Laundering Case - Sakshi

కశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులు పంపింది. దీనిపై ముఫ్తీ స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘భారత ప్రభుత్వం తన చర్యల ద్వారా ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తోంది. విపక్షాలు.. కేంద్రం పాలసీలను, విధానాలను ప్రశ్నించడం ప్రభుత్వానికి నచ్చడం లేదు. ఇలాంటి చర్యలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తోంది. కానీ ఇవేం పని చేయవు’’ అంటూ ముఫ్తీ ట్వీట్‌ చేశారు.

జమ్ముకశ్మీర్‌ పునర్విభజన నేపథ్యంలో ఏడాదికిపైగా గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీని గత ఏడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు జమ్ముకశ్మీర్‌ ఏకీకరణ కోసం స్థానిక పార్టీలన్నీ కలిసి గుప్కార్‌ డిక్లరేషన్ కింద ప్రజల కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమి అధ్యక్షుడు, కశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్‌సీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల ఆస్తులను మనీ లాండరింగ్ కేసు నేపథ్యంలో గత ఏడాది ఈడీ జప్తు చేసింది. ఈ ఆరోపణలపై తాజాగా మెహబూబా ముఫ్తీకి ఈడీ సమన్లు జారీ చేసింది.

Advertisement
Advertisement