ఇకపై రైల్వే స్టేషన్లలో బిల్లులు కట్టొచ్చు

Passengers Can Now Avail Services Like Mobile Recharge In 200 Railway Stations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 200 రైల్వే స్టేషన్లలో మొబైల్‌ ఫోన్‌ రీచార్జ్, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, ఆధార్‌ కార్డు సంబంధ సేవలు, పాన్‌ కార్డు దరఖాస్తు, ట్యాక్స్‌ చెల్లింపులు తదితర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రైలు, బస్సు, విమాన టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, బీమా ఇలా రోజువారీ అవసరాలకు సంబంధించిన పలు సేవలను ఇకపై రైల్వే స్టేషన్లలో కామన్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ) కియోస్క్‌ల ద్వారా అందిస్తారు.

వీటికి ‘రైల్‌వైర్‌ సాథీ కియోస్క్‌’గా రైల్‌టెక్‌ నామకరణం చేసింది. ఈ కియోస్క్‌లను తొలి దశలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద వారణాసి సిటీ, ప్రయాగ్‌రాజ్‌ సిటీ రైల్వే స్టేషన్లలో ప్రారంభిస్తారు. దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని 200 రైల్వేస్టేషన్లకు ఈ కియోస్క్‌ సేవలను విస్తరిస్తారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 44, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వేలో 13, నార్త్‌ ఫ్రంటియర్‌ రైల్వేలో 20, ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 13, వెస్టర్న్‌ రైల్వేలో 15, నార్తర్న్‌ రైల్వేలో 25, వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 12, నార్త్‌ ఈస్టర్న్‌ రైల్వేలో 56 కియోస్క్‌లను ఏర్పాటుచేయనున్నారు.

కొత్త కియోస్క్‌లను సీఎస్‌సీ ఇ–గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తాయని రైల్‌టెక్‌ తెలిపింది. భారతీయ రైల్వే, రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం కలిసి రైల్‌టెక్‌ను  ఏర్పాటుచేశాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే కియోస్క్‌లను తెస్తున్నట్లు రైల్‌టెక్‌ సీఎండీ పునీత్‌ చావ్లా చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top