పాకిస్తాన్‌ బరితెగింపు 

Pakistan Government Released New Map Including Jammu And Kashmir - Sakshi

జమ్మూకశ్మీర్‌ను కలిపేసుకుంటూ కొత్త మ్యాప్‌ ఆవిష్కరణ 

పాకిస్తాన్‌ కేబినెట్‌ ఆమోద ముద్ర  

గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను కూడా కలిపేసుకున్న వైనం   

పాక్‌ చర్యను కొట్టిపారేసిన భారత్‌ 

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: చైనా అండ చూసుకొని దాయాది దేశం పాకిస్తాన్‌ చెలరేగిపోతోంది. భారత్‌ను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. భారత్‌లోని కొన్ని కీలక భూభాగాలు తమవేనని చెప్పుకుంటూ ఇటీవల నేపాల్‌ కొత్త మ్యాప్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అక్కడ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఇదే తరహాలో పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తోపాటు జమ్మూకశ్మీర్‌ను తమలో కలిపేసుకుంటూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ రూపొందించింది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఇండియా ప్రభుత్వం నిర్వీర్యం చేసి బుధవారానికి ఏడాది కానుంది.

అంతకంటే ఒక్కరోజు ముందు మంగళవారం దీన్ని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఆవిష్కరించారు. ఈ కొత్త మ్యాప్‌నకు పాక్‌ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్‌ క్రీక్‌లను కూడా ఈ పటంలో చేర్చడం గమనార్హం. అంతేకాకుండా నియంత్రణ రేఖను(ఎల్‌ఎసీ)ని కారాకోరం పాస్‌ దాకా పొడిగించింది. సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేసింది. పాక్‌ ప్రజలతోపాటు కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షలకు సైతం ఈ మ్యాప్‌ ప్రతిరూపమని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ఇప్పటినుంచి ఇదే పాకిస్తాన్‌ అధికారిక పటమని స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేసి ఏడాది అవుతున్న సందర్భంగా బుధవారం ‘బ్లాక్‌ డే’గా పాటించనున్నట్లు పాకిస్తాన్‌ పేర్కొంది. 

పాక్‌ చర్య హాస్యాస్పదం 
కొత్త మ్యాప్‌ అంటూ పాకిస్తాన్‌ సాగిస్తున్న ప్రచారం అసంబద్ధమైన చర్య అని భారత ప్రభుత్వ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. పాక్‌ ఎత్తుగడ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పాక్‌ చర్యలకు చట్టబద్ధత గానీ, అంతర్జాతీయ సమాజం నుంచి ఆమోదం గానీ లేవని స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top