శతృఘ్నసిన్హా: బయటోడే ‘షాట్‌గన్‌’గా పేలాడు.. రికార్డు మార్జిన్‌తో సంచలన విజయం

Outsider TMC Shatrughan Sinha Wins Asansol With Record Margin - Sakshi

అలనాటి బాలీవుడ్‌ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా .. భారీ విజయం అందుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో ఆయన ఘన విజయం సాధించినట్లు సమాచారం. విశేషం ఏంటంటే.. అసన్సోల్‌ లోక్‌సభ స్థానాన్ని టీఎంసీ దక్కించుకోవడం ఇదే తొలిసారి.

పాట్నాలో పుట్టి, పెరిగి.. రాజకీయాల్లో బీహారీ బాబుగా పేరు ముద్రపడ్డ 76 ఏళ్ల సిన్హా.. రాజకీయ జీవితం కూడా సంచలనమే!.

► అలనాటి బాలీవుడ్‌ హీరో శత్రుఘ్న సిన్హా.. 80వ దశకంలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

 ► వాజ్‌పేయి-అద్వానీల కాలంలో.. స్టార్‌ క్యాంపెయినర్‌గా బీజేపీకి ఆయన ప్రచారం చేశారు. 

► ఆ తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. పాట్నా సాహిబ్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. వాజ్‌పేయి కేబినెట్‌లో శత్రుఘ్న సిన్హా  కేంద్ర మంత్రిగానూ పని చేశారు.

► అయితే పార్టీతో విభేధాలతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. 

► 2019 సార్వత్రిక ఎన్నికల్లో.. పాట్నా సాహిబ్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి.. రవి శంకర్‌ ప్రసాద్‌ చేతిలో ఓడిపోయారు. 
 
► అభిమానులు ముద్దుగా షాట్‌గన్‌ అని పిలుచుకునే శతృఘ్నసిన్హాకు.. రాజకీయాల్లోనూ రెబల్‌ స్టార్‌గా గుర్తింపు ఉంది. బీజేపీ ఎంపీగా ఉన్న రోజుల్లోనే ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించిన సందర్భాలు ఎన్నో. 

► ఎంపీగా ఉన్న.. బాబుల్‌ సుప్రియో బీజేపీని వీడి టీఎంసీలో చేరడంతో అసన్సోల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. 

► ఎన్నికల ప్రచారంలో బీజేపీ.. టీఎంసీ అభ్యర్థి శతృఘ్నసిన్హాను బయటి వ్యక్తిగా ప్రచారం చేసింది. అయితే బెంగాలీలకు ఏమాత్రం వ్యక్తిని తాను అని గట్టిగానే ప్రచారం చేసుకున్నారాయన. 

► అసన్సోల్‌ బరిలో బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌ను చిత్తుగా ఓడించారు శతృఘ్నసిన్హా. 

శత్రుఘ్న సిన్హాపై టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. అలాగే తనదైన శైలిలో గాంభీర్యమైన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకోగలిగారు శత్రుఘ్న సిన్హా.

:::సాక్షి వెబ్‌డెస్క్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top