రజనీకాంత్ నటించిన బాలీవుడ్ సినిమా దాదాపు నలభై ఏళ్ల తర్వాత విడుదల కానుంది. 1989లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ మూవీ ఎట్టకేలకు థియేటర్స్‌లోకి రానుంది. ఈ మూవీలో చాలామంది టాప్ నటీనటులు కలిసి నటించారు. ఒకప్పుడు హిందీ సినిమాను ఏలిన టాప్ నటులంతా ఈ మూవీ కోసం భాగమయ్యారు. ఈ చిత్రాన్ని నిర్మాత రాజా రాయ్ ఆరోజుల్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని, అనితా రాజ్ , ప్రేమ్ చోప్రా, శరత్ సక్సేనా, శరద్ సక్సేనా వంటి స్టార్స్‌తో పాటు మన మధ్యలేని అమ్రిష్ పూరి, జగదీప్ కూడా వెండితెరపై మరోసారి కనిపిస్తారు.
హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ సినిమాకు దర్శకత్వం వహించిన హర్మేష్ మల్హోత్రా ఇప్పటికే మరణించారనే విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసిన చాలామంది నటులు, టెక్నీషయన్స్‌లలో కొందరు మరణించారు. ఈ మూవీ కోసం దేశంలోనే పేరుపొందిన టీమ్ పనిచేసింది. సంగీతాన్ని లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్స్ లక్ష్మీకాంత్–ప్యారేలాల్ అందించగా.. డైలాగ్స్‌ను సలీం-ఫైజ్ రాశారు. భారతీయ సినిమా డాన్స్ ఐకాన్‌గా పేరుపొందిన సరోజ్ ఖాన్ ఇందులో భాగమయ్యారు. రాజా రాయ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా అస్లాం మిర్జా, షబానా మిర్జా పనిచేశారు.

తాజాగా ఈ మూవీ విడుదలపై నిర్మాత రాజా రాయ్ రియాక్ట్ అయ్యారు. హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ మూవీపై తాము ఎప్పుడూ కూడా ఆశలు వదులుకోలేదన్నారు. అయితే, ఈ మూవీ మొదలైన తర్వాత ఎక్కువగా బాధలను ఎదుర్కొన్నామని గుర్తుచేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ చిత్రం విడుదలౌతుంది అంటే కేవలం విధి రాతగా ఉందన్నారు. ఫైనల్‌గా తమ కోరిక నెరవేరుతుందని చెప్పుకొచ్చారు.
ఈ మూవీకి ఇప్పటి టెక్నాలజీని ఉపయోగించినట్లు అస్లాం మిర్జా పేర్కొన్నారు. పిక్చర్ నాణ్యతతో పాటు సౌండ్ కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించినట్లు చెప్పారు. కథలో ఎలాంటి మార్పులు లేకుండానే ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు చెప్పారు. ఆ కాలానికి అనుగుణంగానే ఇందులోని కలర్, విజువల్స్ ఉంటాయని తెలిపారు.
వాయిదాకు కారణం
1989లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆలస్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మూవీకి సెన్సార్, డబ్బు సమస్యలు లేవు. ఎక్కువగా వ్యక్తిగత కారణాల వల్లే విడుదలకు నోచుకోలేదు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిర్మాత రాజా రాయ్ తన వ్యాపార నిమిత్తం లండన్ వెళ్లారు. అయితే, తన చిన్న కుమారుడు అక్కడే మరణించడంతో చాలా కుంగిపోయాడు. చాలా ఎళ్లుగా తను కోలుకోలేదు. దీంతో సినిమా విడుదల ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత మూవీని విడుదల చేద్దామని కార్యచరణ ప్రారంభించారు. ఇంతలో దర్శకుడు హర్మేష్ మల్హోత్రా మరణించడంతో మళ్లీ బ్రేక్ పడింది. ఇలా పలు కారణాలతో సినిమా విడుదల కాలేదు. ఫైనల్‌గా 4K టెక్నాలజీతో ఇప్పుడు హమ్ మేన్ షాహెన్‌షా కౌన్ టైటిల్‌తోనే విడుదల కానుంది.


