Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..    | Sakshi
Sakshi News home page

Odisha Accident: కొడుకు శవాన్ని చేతుల్తో మోశా..   

Published Sun, Jun 4 2023 8:48 AM

Odisha Accident Victims Families Tearful Stories - Sakshi

బాలాసోర్‌: ఒడిశా మూడు రైళ్ల ప్రమాదంలో ఎన్నో కన్నీటి కథలు మనసుని పట్టి కుదిపేస్తున్నాయి. ఎప్పటికైనా తనకి తలకొరివి పెడతాడని అనుకున్న కొడుకు శవాన్నే చేతులతో మోయాల్సి రావడం ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. బీహార్‌లో మధువనికి చెందిన లాల్జీ సాగై చెన్నైలో గార్డుగా పని చేస్తున్నాడు. తన ఇద్దరు కుమారులు సుందర్, ఇందర్‌లను కూడా చెన్నైకి తీసుకువెళితే కుటుంబం హాయిగా బతికేయవచ్చునని అనుకున్న ఆ తండ్రి వారిని తీసుకువెళ్లడానికి సొంతూరుకి వచ్చాడు. 

అక్కడ్నుంచి కోల్‌కతాకి వచ్చి  కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కారు. రైలు ప్రమాదంలో తండ్రి లాల్జీ , చిన్న కుమారుడు ఇందర్‌ ప్రాణాలతో మిగిలితే కొడుకు సుందర్,  బావమరిది దిలీప్‌ మృత్యు ఒడికి చేరుకున్నారు. ‘‘కళ్ల ముందే నా కొడుకు గాయాలతో పడిపోయాడు. నా చేతుల్తో మోసుకుంటూ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కి తెచ్చాను. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు. విధి మా కుటుంబం మీద పగ పట్టింది’’ అంటూ పుత్ర శోకంతో కన్నీరుమున్నరవుతున్నాడు.

మొబైల్‌ ఫ్లాష్‌ వెలుగులోనే.. 
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చుట్టుపక్కలున్న స్థానికులు అందరికంటే ముందుగా ప్రమాద స్థలికి చేరుకున్నారు. చిమ్మ చీకట్లో బోగిల్లోకి వెళ్లడానికి వారు తమ మొబైల్‌ ఫోన్లలో ఫ్లాష్‌ లైట్లలోనే సహాయ కార్యక్రమాలు సాగించారు. తమ చేతులతోనే బోగీ అద్దాలు పగులగొట్టి లోపలకి వెళ్లి క్షతగాత్రుల్ని బయటకి తీసినట్టు పూర్ణ చంద్ర మాలిక్‌ అనే రైతు చెప్పాడు. ‘‘బాధితుల రోదనలు వింటూ ఉంటే మనసు కదిలిపోయింది. వారిని కాపాడడం కోసం నా చేతుల్తో బోగీ అద్దాలు పగుల గొట్టా. లోపల భయంకరమైన దృశ్యం కనిపించింది. కొంతమందికి కాళ్లు, చేతులు తెగిపడి ఉన్నాయి. మరికొందరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. కాసేపు అందరం షాక్‌కి లోనయ్యాం. వెంటనే తేరుకొని మాకు చేతనైన సాయం చేశాం. 30 మందిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించాం’’ పూర్ణ చంద్ర మాలిక్‌ వివరించారు.  

రైలు స్పీడ్‌ను వీడియో తీస్తుండగా.. 
కోల్‌కతా నుంచి కటక్‌ వెళ్లడానికి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన మాణికల్‌ తివారీ అనే ఒక వ్యాపారి రైల్లో వీడియో తీస్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైలు ఎంత స్పీడ్‌గా వెళుతోందో తన కుటుంబ సభ్యులకు చూపించాలన్న ఉత్సాహంతో అతను కిటికీ దగ్గర కూర్చొని వీడియో తియ్యడం మొదలు పెట్టాడు. హఠాత్తుగా బోగి చిమ్మచీకటిగా మారిపోయి పొగతో నిండిపోయింది. ఆయన చేతులు రక్తమోడడం మొదలైంది. ఒక్క క్షణం అతనికి ఏమీ అర్థం కాలేదు. బోగి అంతా పొగతో నిండిపోవడంతో అతను ఎలాగో బయటకి వెళ్లాడు. పట్టాలపై శవాల్ని చూసిన తర్వాత కానీ అతనికి ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో అర్థం కాలేదు. ‘‘అంతా సెకండ్లలో జరిగిపోయింది. అదృష్టం బాగుండి నేను బతికి బయటపడ్డాను. నా ఎదురుగా యువజంటలో భర్త మరణించాడు. భార్య మిగిలి ఉంది. ఈ రోజు ఒక బ్లాక్‌ ఫ్రైడే’’ అని తివారీ చెప్పారు.  

మందుల కోసం డబ్బులు పంపిస్తానని తిరిగిరాని లోకాలకు.. 
అనారోగ్యంతో ఉన్న తండ్రికి మందుల ఖర్చులకి డబ్బులు పంపిస్తానని చెప్పి బయల్దేరిన ఆ యువకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బీహార్‌కు చెందిన రాజా పటేల్‌ (26) అనే యువకుడు ఇతర వలస కూలీలతో కలిసి కేరళ వెళ్లడానికి కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రైలు ప్రమాదంలో కొడుకు మరణించాడని తెలిసిన తండ్రి భోలన్‌ కుప్పకూలిపోయాడు. ఆ కుటుంబానికి పటేల్‌ సంపాదనే జీవవనాధారం. వెన్నుముకకి సంబంధించిన సమస్యతో బాధపడుతున్న తండ్రి భోలన్‌ ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో నెల తిరిగేసరికల్లా కొడుకు పంపే డబ్బుల కోసమే వారు ఎదురు చూస్తుంటారని పొరుగింట్లో ఉన్న అవినాశ్‌ పాండే చెప్పాడు. 

నిద్రలోనే మృత్యుఒడిలోకి.. 
బాలాసోర్‌: పెను ప్రమాదం పలు సెకన్లలోనే ముగిసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6.50 గంటల నుంచి 7.10 మధ్యకాలంలోనే ఈ ప్రమాదం సంభవించింది. అంటే కొద్దిసేపట్లోనే అంతా ముగిసిందని, ఆ సమయంలో ప్రయాణికులు నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రయాణికులు నిద్ర మత్తులో ఉంటడంతో అసలేం జరుగుతుందో తెల్సుకునేలోపే అంతా జరిగిపోయిందని, తప్పించుకునే అవధికూడా లేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పట్టాల మధ్య చిక్కుకున్న వారిని కాపాడేందుకు విపత్తు స్పందన దళ సభ్యులు శతథా శ్రమిస్తున్నారు. వీరికి స్థానికులు అండగా నిలిచి తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటికే మానవత్వంతో ఎంతో మంది స్థానికులు వయోబేధంతో సంబంధం లేకుండా ఆస్పత్రులకు తరలివచ్చి రక్తదానానికి సిద్ధపడ్డారు. వీరికి నెటిజన్లు సలామ్‌ కొడుతున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి.

వేగంపై తప్ప భద్రతపై దృష్టి లేదు
‘రైల్వే వ్యవస్థ విస్తరించే కొద్దీ అవసరమైన సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరగాలి. కానీ ప్రస్తుతం రైల్వేలో దాదాపు రెండున్నర లక్షల ఖాళీలున్నాయి. రైళ్లను వేగంగా నడిపేలా విదేశాలతో పోటీ పడుతున్న రైల్వే, అక్కడి వ్యవస్థ తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గంటకు 130 కి.మీ. వేగంతో రైళ్లు పరుగెత్తాలన్నప్పుడు దిగువ సిమెంటు కాంక్రీట్‌ ట్రాక్‌ ఉండాలి, కానీ మన వద్ద నేరుగా నేలపైనే కంకర పరిచి ఏర్పాటు చేస్తున్నారు. అంత వేగాన్ని ఇది తట్టుకోలేదు. వేగం కంటే భద్రత ముఖ్యమన్న విషయాన్ని గుర్తించాలి’
– శంకరరావు, సీనియర్‌ రైల్వే కార్మిక నేత

ఊహాగానాలొద్దు.. 
‘‘రైలు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు అవి ఎలా జరిగాయనే ఊహాగానాల జోలికి వెళ్లొద్దు. ప్రమాదానికి అసలు కారణాన్ని రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తేలుస్తారు. అందుకు తగ్గ అర్హతలున్న వారే ఆ పోస్టులో ఉంటారు. ప్రమాదాలకు అసలు కారణాలు తేలాకగాని కారణాలను విశ్లేషించలేం. ఆ ప్రమాదం నేపథ్యంలో ఆ అధికారి బృందం కొన్ని సిఫారసులు చేస్తుంది. వాటికి తగ్గ చర్యలు తీసుకోవాలి’’
- స్టాన్లీబాబు, మాజీ జీఎం.

ఇది కూడా చదవండి: అదే జరిగితే ప్రమాదం తప్పేదా?

Advertisement
 
Advertisement