కేరళలో కొత్త వైరస్ కలకలం.. ఆందోళనలో అధికారులు

Noro Virus Cases Reported In Kerala - Sakshi

తిరువనంతపురం: ఇప్పటికే కరోనా వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తుంటే తాజాగా కేరళలో మరో వైరస్‌ కేసు నమోదు కావడం ఆ రాష్ట్రాన్ని కలవరం పెడుతోంది. తాజాగా వాయనాడ్‌ జిల్లాలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. వివరాల ప్రకారం.. వాయనాడ్ జిల్లాలోని వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లోని వెటర్నరీ కళాశాలలో 13 మంది విద్యార్థులకు అరుదైన నోరోవైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.

జంతువుల ద్వారా సంక్రమించే నోరో వైరస్, కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తుందని చెప్పారు. వ్యాధి నియంత్రణకు మార్గదర్శకాలను జారీ చేశారు. ‘సరైన నివారణ, చికిత్సతో నోరో వైరస్‌ వ్యాధి త్వరగా నయమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాధి, దాని నివారణ మార్గాల గురించి తెలుసుకోవాలి’ అని పేర్కొన్నారు. తాగునీటి వనరులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.

పరిస్థితులు అదుపులోకి వచ్చినప్పటికీ, మరింత వ్యాప్తి చెందకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆ వెటర్నరీ కళాశాల విద్యార్థుల డేటాను సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు. వెటర్నరీ కళాశాల అధికారులు మాట్లాడుతూ.. క్యాంపస్ వెలుపల హాస్టళ్లలో నివసిస్తున్న విద్యార్థులలో మొదట ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో ఈ ఘటన వెలుగలోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధ్యక్షతన ఆ ప్రాంత ఆరోగ్య అధికారుల సమావేశం నిర్వహించి వాయనాడ్‌లో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం వైద్య అధికారులు మాట్లాడుతూ..ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top