
నాగ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో 11 ఏళ్ల పాలనలో తన పాత్రపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు జరిగింది న్యూస్‌రీల్ మాత్రమే, అసలు సినిమా ముందుందని పేర్కొన్నారు. అయితే, నాయకులకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలని అంశాన్ని పార్టీయే చూసుకుంటుందని, పార్టీ నిర్ణయాన్ని అనుసరించి పనిచేస్తానని తెలిపారు.
‘ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే. అసలైన సినిమా మొదలు కావాల్సి ఉంది’ అని గడ్కరీ శనివారం నరేంద్ర మోదీ ప్రభుత్వం 11 ఏళ్ల పాలనపై పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తన రాజకీయ జీవితాన్ని గురించి ఎన్నడూ చెప్పుకోలేదని, విమానాశ్రయాలలో తనకు అట్టహాస స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని మద్దతుదారులను ఎప్పుడూ కోరలేదని ఆయన నొక్కి చెప్పారు. విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న వ్యక్తిగత లక్ష్యం మేరకు పనిచేస్తున్నానన్నారు.
రహదారుల అభివృద్ధి కంటే వ్యవసాయం, సామాజిక కార్యక్రమాలపైనే ఆసక్తి ఎక్కువని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి అయిన గడ్కరీ వివరించారు. తలసరి ఆదాయం లెక్కన మన దేశం టాప్ 10లో లేకపోవడానికి అధిక జనాభాయే కారణమని అభిప్రాయపడ్డారు. అందుకే, జనాభా నియంత్రణకు బిల్లు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇది మతానికో, భాషకో సంబంధించిన అంశం కాదు. ఇది ఆర్థిక పరమైన అంశం. అభివృద్ధి ఎంత జరిగినా, ఫలాలు కనిపించడం లేదు. జనాభా అధికంగా పెరగడమే ఇందుకు కారణం’అని వివరించారు.