పేపర్ లీక్ నిర్ధారణ కారణంగానే నీట్ పరీక్ష రద్దు చేశామని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తమకెంతో కీలకమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే రీ ఎగ్జామ్ పెట్టే నిర్ణయం తీసుకున్నాం. ప్రతిభ గల విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేశామని తెలిపారు.
సీబీఐ ఈ అంశంపై విచారణ చేపడుతుంది త్వరలోనే లీకు మాఫియాను పట్టుకుంటుందని ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో మాల్‌ప్రాక్టిస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రీఎగ్జామ్‌కు ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదన్నారు. జూన్ 14 లోపు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గతంతో పోలిస్తే ఎగ్జామ్ సమయాన్ని 15 నిమిషాలు పెంచామన్నారు. కాగా కొద్ది సేపటి క్రితమే నీట్ ఎగ్జామ్ కొత్త తేదీలను NTA ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్ష ఉండనున్నట్లు తెలిపింది. ఈ నెల 3న జరగాల్సిన పరీక్ష పేపర్ లీక్ కారణాలతో రద్దైన నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షరద్దైంది. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్‌తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు. ఈ నేపథ్యంలో కొత్త తేదీలను ప్రకటించింది.


