జూన్‌ 21న నీట్‌ రీఎగ్జామ్‌ | NEET 2026 Re-Examination on June 21, Education Minister Pradhan | Sakshi
Sakshi News home page

జూన్‌ 21న నీట్‌ రీఎగ్జామ్‌

May 16 2026 4:32 AM | Updated on May 16 2026 4:33 AM

NEET 2026 Re-Examination on June 21, Education Minister Pradhan

వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 

ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు  

ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం  

నీట్‌ రీఎగ్జామ్‌ వ్యవధి 15 నిమిషాలు పెంపు  

వచ్చే నెల 14 కల్లా అభ్యర్థులకు అడ్మిట్‌ కార్డులు జారీ  

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటన  

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్‌)–యూజీ రీఎగ్జామ్‌ జూన్‌ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఈ నెల 3న నిర్వహించిన నీట్‌(యూజీ)–2026 పరీక్షను పేపర్‌ లీక్‌ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలో నీట్‌ పరీక్షలో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నీట్‌(యూజీ) పరీక్షలో అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

రద్దయిన నీట్‌ను జూన్‌ 21న మళ్లీ నిర్వహించబోతున్నామని, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాలు పెంచినట్లు తెలిపారు. ఎక్కడ పరీక్ష రాయాలన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చని, జూన్‌ 14 కల్లా అడ్మిట్‌ కార్డులు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నీట్‌ అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లను కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరు కావాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్‌ భరోసా ఇచ్చారు. పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామన్నారు.  

ఎవరికీ అన్యాయం జరగనివ్వం  
మాఫియా కుట్రలు, ధన బలం వంటివి విద్యార్థుల మెడికల్‌ సీటును లాక్కోవాలని తాము కోరుకోవడం లేదని ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. ఇప్పటిదాకా జరిగిన దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గెస్‌ పేపర్‌ ముసుగులో కొన్ని ప్రశ్నలు పరీక్షకు ముందే బయటకు వచ్చాయంటూ ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా ప్రాథమిక విచారణ ప్రారంభించామని చెప్పారు. మే 3న పరీక్ష జరిగే, 7న ఫిర్యాదులు వచ్చాయన్నారు. 

పేపర్‌ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులను శిక్షించడం తథ్యమని పేర్కొన్నారు. గతంలో నీట్‌ పరీక్షలో అక్రమాలు బయటపడిన తర్వాత రాధాకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులను అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. అయినప్పటికీ ఈ ఏడాది పేపర్‌ లీకేజీ ఘటన జరిగిందని, అందుకే మొదటి చర్యగా పరీక్షను రద్దు చేశామని తెలియజేశారు. నీట్‌ విషయంలో ఎవరైనా భయాందోళనలు, అవాంతరాలను సృష్టిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. 

మన వ్యవస్థను విశ్వసించాలి  
ఓఎంఆర్‌ విధానంతో పోలిస్తే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానం కొంత మెరుగైనదని ధర్మేంద్ర ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పరీక్షకు కొంత రక్షణ ఉంటుందన్నారు. మరోవైపు సైబర్‌ నేరాలు పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో సవాళ్లు ఉన్నప్పటికీ, మన దేశ వ్యవస్థను మనం విశ్వసించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జరిగే రీటెస్టుకు సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. ఏ నగరంలో పరీక్ష రాయాలో నిర్ణయించుకోవడానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. నీట్‌ టెస్టు జూన్‌ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల దాకా జరుగుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement