
ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో పరస్పర పోటీకి సిద్ధమవుతున్న నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్
ఈ సీట్లపై కన్నేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లో ఉప ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మిత్రపక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్‌గాం, నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు ఒమర్ ప్రభుత్వానికి సమస్యలను పెంచాయి. నగ్రోటా ఉప ఎన్నికలో పోటీ చేయడంపై రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి అటు నేషనల్ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. నగ్రోటాలో రెండు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకపోతే కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సీట్లపై ఇప్పుడు బీజేపీ దృష్టి సారించింది.
నిజానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఒమర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీని తరువాత, కాంగ్రెస్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఘర్షణ మూడ్‌లో ఉంది. కాంగ్రెస్ నాయకులు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశంపై గళం విప్పుతూ, ముఖ్యమంత్రిని కూడా బెదిరిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు 41 సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా, ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్, ఏడుగురు స్వతంత్రులు, ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మద్దతు ఉంది.
మిత్రపక్షాల మద్దతుదారుల సంఖ్యతో కలిపి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి 55 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్రోటా ఉప ఎన్నిక బరి నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యరి్థని నిలబెడితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే, ఒమర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 49కి తగ్గుతుంది.
మరోవైపు నగ్రోటా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ వల్ల బీజేపీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. కాగా బడ్‌గాం స్థానంలోనూ కమలదళం తన అభ్యరి్థని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన పోటీ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీల మధ్యే ఉండేది. అయితే అమర్‌నాథ్ యాత్ర తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నగ్రోటా, బడ్‌గాంల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ రెండు సీట్లు ఖాళీగా ఉండి ఆరు నెలలు అయ్యింది. అయితే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఆరు నెలల తర్వాత ఏదైనా సీటును ఖాళీగా ఉంచవచ్చు. ఆరు నెలల వ్యవధి తర్వాత కూడా ఒక సీటును ఖాళీగా ఉంచడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.